సంతోషం కావాలంటే స్విచ్ ఆన్ చేయాల్సిందే!

ప్రస్తుత జీవితం ఎట్లా ఉంది??

ప్రతిఒక్కరూ జీవితంలో సంతోషాన్నే కోరుకుంటారు. ఆత్మీయులు, స్నేహితులు కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండు అని చెబుతూ ఉంటారు. కానీ సంతోషం ఏమి అంగట్లో దొరికేది కాదు. కాసింత డబ్బులిచ్చి తెచ్చుకోవడానికి. అయితే జీవితంలో సంతోషం ఉంటే ఆ మజా వేరు. చాలామంది అనుకుంటూ వుంటారు ఎప్పుడూ సంతోషంగా ఉండటం ఎలానో?? అని. మరికొంత మంది ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అనుకుంటూ ఏదో ఒకటి చేస్తుంటారు. మరికొందరు స్నేహితులను కలుస్తూనో, కుటుంబసభ్యులతో గడుపుతూనో, ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ విషయాల్లో లీనమవుతూనో ఉంటారు. కానీ ఎన్ని చేసినా సంతోషంగా మాత్రం ఉండరు. అవును మరి సంతోషం కోసం చేసే ప్రతి పనీ కేవలం తాత్కాలికం మాత్రమే. వర్షం కురిసినంత సేపే కురిసి మాయమవడం లాంటిదే ఈ సంతోషం కూడా. వర్షం తాలూకూ మట్టివాసనలా సంతోషం తాలూకూ జ్ఞాపకాలు కూడా కొన్ని మిగులుతుంటాయి అంతే. 

సంతోషం కోసం వెతుకుతున్నారా??

కానీ ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే మీలో ఉన్న స్విచ్ ను ఆన్ చేయాలి మరి. ఆశ్చర్యంగా అనిపిస్తుందేమో కానీ ఇదే నిజం. ప్రతి మనిషి తాను సంతోషంగా ఉండాలంటే మొదట తన ఆలోచన, తనకు తాను ప్రాధాన్యం ఇచ్చుకోవడం, తనకు సంబంధం లేని విషయాలను పట్టించుకోకుండా ఉండటం, తాను చేయవలసిన పనిని మనస్ఫూర్తిగా చేయడం వంటివి చేయాలి. పలితాన్ని గూర్చి, పరిధిని గూర్చి ఆలోచిస్తే మాత్రం మానసులో ఒకానొక కల్లోలం తెలియకుండానే మొదలైపోతుంది.

వేగవంతమైన ప్రపంచంలో మనిషి చేస్తున్న తప్పేంటో తెలుసా?? చేసే ప్రతి పనిని ఆస్వాదించకపోవడం. కృత్రిమంగా ముందుకెళ్లిపోవడం. సరిగ్గా గమనించుకుంటే ప్రస్తుతం అందరూ రోజు చేస్తున్న పనులు కానీ, వృత్తి రీత్యా చేస్తున్న పనులు కానీ, తప్పక చేయాలనే ఉద్దేశంతోనో లేక, అవసరం కాబట్టి చేయాలనో లేక సంపాదన కావాలంటే చేయాలి కాబట్టి అనుకుని చేస్తూ ఉంటారు. 90% మంది ఇలా చేస్తున్నవాళ్లే. కాబట్టే చేస్తున్న పనిని ఆస్వాదించలేకపోతున్నారనేది వాస్తవం. 

మరిప్పుడెం చేయాలి??

సంతోషానికి కావలసిందల్లా మనసు పాజిటివ్ గా ఉండటం మొదటి విషయమైతే, చేసే పనిని ఏదో మరయంత్రంలా కాకుండా ఆస్వాదిస్తూ, ప్రతిపనిలో ఉత్తమ పలితాన్ని ఇవ్వడానికి పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ చేయడం.  చాలామంది ఏదో పెద్ద లాభం ఉన్న పనుల విషయంలో తప్ప మిగిలిన విషయాలను పెద్దగా పట్టించుకోకుండా అలా చేసేస్తుంటారు. కానీ ఒక్కసారి అలాంటి ధోరణి వదిలి ప్రతి పనిని అంటే కనీసం తినడం కావచ్చు, తాగడం కావచ్చు, వంట చేయడం కావచ్చు, ఆఫీస్ పనులు, ఇతరులను పలకరించడం, కనీసం నవ్వడం ఇలా బోలెడు విషయాలు ఉంటాయి. ప్రతి ఒక పనిని మనపూర్వకంగా చేయగలిగితే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. 90% అపజయం అనే మాట దరిచేరదు. ఒకవేళ అలాంటి పరాజయాలు ఎదురైనా చిరునవ్వుతో వాటిని స్పోర్టివ్ గా తీసుకోవడం అలవాటు అవుతుంది. 

ప్రపంచం చిన్నదని కొందరు అంటారు.  కాదు పెద్దదని మరికొందరు అంటారు. అంటే చూసే విధానంలోనే ఏదైనా ఉంటుందనేది నిజమని ఒప్పుకోవచ్చు కదా!! అలాగే సంతోషాన్ని ఎక్కడినుండో తెచ్చుకొనక్కర్లేదు. ఒకరి నుండి దాన్ని పొందడానికి అస్సలు ప్రయత్నించకూడదు. సంతోషం ఎప్పుడూ మనతోనే, మనలోనే, మనం ఆస్వాదించడంలోనే ఉంటుంది. దాన్ని రుచి చూడాలంటే కావలసిందల్లా కేవలం మనసును స్విచ్ ఆన్ చేయడమే. అన్నిటినీ మనసుతో ఆస్వాదిస్తూ చేసుకుపోవడమే. అలా చేసినపుడు సంతోషం కోసం మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అదే మీ వెంట ఉంటుంది.

◆ వెంకటేష్ పువ్వాడ