ఆంధ్రా ప్రాంతం వారు సీఎం అయినప్పుడే ఆ డిమాండ్
posted on Jan 30, 2012 9:43AM
కర్
నూలు: కేవలం ముఖ్యమంత్రి పదవి కోసమే ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలు చేస్తున్నారని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రాంతానికి అభివృద్ధిలో అన్యాయం జరిగినట్లుగా కనబడటం లేదన్నారు. ఆంధ్రా ప్రాంతం వారు ముఖ్యమంత్రి అయినప్పుడే తెలంగాణ డిమాండ్ వస్తోందని అన్నారు. పివి నరసింహా రావు, అంజయ్య, చెన్నారెడ్డి, జలగం వెంగళ రావు ముఖ్యమంత్రులుగా పని చేసిన సమయంలో ఎటువంటి ఉద్యమాలు లేవని ఆయన అన్నారు. మూడేళ్లు ఆంధ్ర ప్రాంతం వారికి, రెండేళ్లు తెలంగాణ ప్రాంతం వారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే విధానం అమలు చేస్తే ఇటువంటి సమస్యలు ఉండవన్నారు. తెలంగాణ విషయంలో తాను చేసిన సూచనలపై సుదీర్ఘ చర్చ జరగాలన్నారు.