తెలుగుజాతికి పెద్ద పండుగ మహానాడు!

తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుకు రాజమహేంద్రవరం వేదిక అయింది. ఈ మహానాడుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి అన్నగారు అభిమానులు భారీగా పోటెత్తారు. మరోవైపు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలు పసుపు   శోభను సంతరించుని బంతిపూల వనంలా మారాయి. ఇక ఇటు మీడియాలో... అటు సోషల్ మీడియాలో రాజమహేంద్రవరంలో మహానాడు.. రాజమహేంద్రవరంలో మహానాడు అంటూ.... తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణతోపాటు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 

 తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏటా జరుపుకొంటున్న మహానాడు.. పార్టీ శ్రేణులకు ఓ పర్వదినం. అదే విధంగా తెలుగు తమ్ముళ్లకు అత్యంత ఆత్మీయమైన రోజు. అంతే కాదు.. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా జరుపుకుంటున్న ఈ మహానాడు తెలుగుజాతీ యావత్తుకు పెద్ పండుగ.  అసలు అలాంటి రోజుకు.. మహానాడు అనే పేరు అసలు ఎలా వచ్చింది. అలాగే ఈ మహానాడును తెలుగుదేశం పార్టీ మే నెల చివరి రోజుల్లోనే ఎందుకు జరుపుకొంటుంది. అయినా మహానాడు అంటే అర్థం ఏమిటి?.. ఇంతకీ మహానాడు అనే పేరు ఎవరు,ఎందుకు పెట్టారనే అంశాలను తెలుసుకునేందుకు రాజమహేంద్రవరంలో మహానాడు జరుగుతోన్న వేళ ప్రజలు గుగూల్‌ను ఆశ్రయిస్తున్నారు.  

వెండితెర కథనాయకుడిగా ఓ వెలుగు వెలుగుతోన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు.. 1982, మార్చి 29వ తేదీ హైదరాబాద్‌లోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ తర్వాత తొమ్మిది నెలలకే జరిగిన ఎన్నికల్లో  తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించింది. దీంతో అప్పటి వరకు రాష్ట్రంలో అప్రపతీహతంగా సాగుతోన్న కాంగ్రెస్  పాలనకు అన్న ఎన్టీఆర్ చెక్ పెట్టినట్లు అయింది. 

మరోవైపు టీడీపీ ఆవిర్భవించిన తర్వాత.. పార్టీ జెండా, గుర్తు, పథకాల రూపకల్పన తదితర అంశాలపై వాడివేడిగా చర్చోపచర్చలు జరుగుతోన్న వేళ.. పార్టీలోని ఇతర నాయకుల అభిప్రాయాలను సైతం ఎన్టీఆర్ స్వీకరించారు. ఆ క్రమంలో 1982, ఏప్రిల్ 11వ తేదీన పార్టీ విధి విధానాలు, ఆశయాలను ప్రజల్లోకి బలంగాతీసుకు వెళ్లేందుకు హైదరాబాద్ నిజాం కాలేజీ గ్రౌండ్స్‌ వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ సంకల్పించారు. అందులోభాగంగా ఈ సభకు ఏ పేరు పెడితే బాగుంటుందంటూ చర్చ జరుగుతోండగా.. మహానాడు పేరు పెడదామని ఎన్టీఆర్ సూచించడంతో.. ఆయన సూచనకు అందరు హ్యాట్సాఫ్ చెప్పారు. కానీ 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ గెలిచి.. అధికారంలోకి వచ్చిన తర్వాత మే 28న  గుంటూరులో నిర్వహించిన సభ నే  తొలి మహానాడుగా పేర్కొనడం విశేషం. 


అయితే టీడీపీ అగ్రశేణి నాయకుల నుంచి సాధారణ కార్యకర్త వరకు అందరూ కూడా మహానాడుకి అధిక ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సభ ప్రాంగణం వేదికగా అంతా కలసి తీర్మానాలు ఆమోదించుకోవడం... పార్టీ ప్రారంభమైన నాటి నుంచి ఓ ఆచారంగా వస్తుందన్న విషయం విధితమే. అలాగే ఇదే వేదికగా పార్టీ అధ్యక్షులను సైతం ఎన్నుకొవడం మరో విశేషం. అలాగే పార్టీ చేపట్టే భవిష్యత్తు కార్యాచరణను సైతం ఇదే మహానాడు వేదికగా ప్రకటిస్తూ పార్టీ అధినేతలు వస్తున్నారు.  

మరోవైపు తెలుగుదేశం పార్టీ ప్రతీ ఏటా మహానాడును మే 27 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. అంటే మే 28వ తేదీ ఎన్టీఆర్ జన్మదినం. ఈ నేపథ్యంలో ఆయన పుట్టిన రోజుకు ఒక రోజు ముందు.. అలాగే ఆయన జన్మదినం మరునాడు నిర్వహిస్తు వస్తున్నది.. కానీ 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి, అలాగే 2020, 2021 కరోనా నేపథ్యంలో మహానాడు ప్రజల మధ్య జరుపుకోలేదు. ఈ మహానాడును ఆన్‌లైన్‌లో జరుపుకోవడం విశేషం. మరోవైపు కరోనా నేపథ్యంలో మహానాడును మూడు రోజుల నుంచి రెండు రోజులకు కుదించారు. 

ఇక 2022, మే 27న ప్రకాశం జిల్లా ఒంగోలు వేదికగా నిర్వహించిన మహానాడు సూపర్ డూపర్ హిట్ అయింది. టీడీపీ ఆవిర్భవించి 40 ఏళ్లు కావడంతోపాటు ఎన్టీఆర్ 99వ జయంతి   కూడా ఇదే మహానాడు వేదికగా జరగడం మహావిశేషం.  


తెలుగుదేశం పార్టీ స్థాపించిన 41 ఏళ్లు అయినా.. కొన్ని సార్లు మహానాడు జరుపుకోలేదన్న సంగతి తెలిసిందే. ఇక మహా అంటే మొత్తం సమీకరణ, గంభీరం అని అర్థాలు సూచిస్తుంది. దీంతో మహానాడు అంటే.. అందరికీ కలుపుకొని పోయే రోజుగా భావిస్తున్నారు. అదీకాక పార్టీ స్థాపించిన తొలినాళ్లలో మహనాడు ఒక రోజే నిర్వహించే వారు. కానీ ఈ సభకు పార్టీ శ్రేణులు భారీగా తరలి రావడం.. వారిందరిని మాట్లాడించడం కోసం.. సమయం చాలకపోవడంతో.. ఆ తర్వాత ఒక రోజును..  రెండు రోజులకు. అలాగే రెండు రోజులను మూడు రోజులకు  పొడిగించారు. కానీ కరోనా నేపథ్యంలో మహానాడు రెండు రోజులకే పరిమితం చేస్తున్నట్లు ఒంగోలులో జరిగిన మహానాడు వేదికగా పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించిన విషయం విదితమే. ఏదీ ఏమైనా అన్న నందమూరి తారక రామారావు చేతుల మీదగా.. ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ అన్న గారి చిరు నవ్వులా... నిత్యం వెలుగుతూ.. సమాజమే నా దేవాలయం.. ప్రజలే నా దేవుళ్లు అన్నట్లుగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సేవలో.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై గళమెత్తి అన్నగారి నిత్య సత్యాస్పూర్తితో ముందుకు కదం తొక్కుతోంది.