కలికాలం పోలీసులు... వీళ్లకు రూల్స్ వర్తించవు
posted on Apr 11, 2021 3:29PM
హైదరాబాద్ పోలీసులు మరోసారి అడ్డంగా బుక్కయ్యారు. తాము చెప్పే నీతులు జనాలకే గాని తమకు వర్తించవంటూ మరోసారి రుజువు చేసుకున్నారు. ట్రాఫిక్ నిబంధనలపై పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే పొద్దున లేస్తే ట్రాఫిక్ నిబంధనలపై నెట్టింట ఊదరగొట్టే పోలీసులు.. వారే నిబంధనలను ఉల్లంఘించడం చర్చనీయాంశమైంది. సామాన్యుడికి బోధించే ముందు పోలీసులు తమ సిబ్బందికి అవగాహన కల్పించాలంటూ నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్ లో తాజాగా ముగ్గురు మహిళా పోలీసులు బైక్ పై వెళుతున్న ఫోటో వైరల్ గా మారింది. బైక్‌పై ముగ్గురు ప్రయాణించడమే పెద్ద తప్పు. అందులోని ఇద్దరూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు. అంతేనా, మధ్యలో కూర్చున్న ఆమె, డ్రైవింగ్ చేస్తున్న వారి చెవిలో ఫోన్ పెట్టి మరి సహకరిస్తుంది. ఇక హెల్మెట్ ఉందా..? అంటే అదీ లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న పోలీస్ సిబ్బందిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ట్వీట్ చేశారు. కలికాలం పోలీసులు అంటూ ఆయన ఈ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు.

ద్విచక్ర వాహనంపై ముగ్గురు మహిళా పోలీసులు వెళుతూ... ఫోన్ మాట్లాడుతున్న ఫొటోను దాసోజు శ్రవణ్ ట్వీట్ చేయగా అది వైరల్‌గా మారింది. తన ట్వీట్‌కు రాష్ట్ర డీజీపీని ట్యాగ్ చేశారు దాసోజు. ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. పెద్ద ఎత్తున నెటిజన్లు రీట్వీట్లు చేస్తూ... ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది తీరును విమర్శిస్తున్నారు.