జ‌మ్మ‌ల‌మ‌డుగులో జ‌గ‌న్‌కు దేత్త‌డి.. టీడీపీలో చేరిన దేవగుడి..

క‌డ‌ప జిల్లాలో బ‌ల‌మైన వ‌ర్గం టీడీపీలో చేరింది. సీఎం జ‌గ‌న్‌రెడ్డికి సొంత ఇలాఖాలో ఇది మింగుడుప‌డ‌ని ప‌రిణామ‌మే. మాజీ ఎమ్మెల్సీ దేవ‌గుడి నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్ రెడ్డిలు చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన వెంటనే భూపేష్ రెడ్డికి జమ్మలమడుగు పార్టీ భాద్యతలను అప్పగించారు చంద్రబాబు.

మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత ఆదినారాయణరెడ్డికి నారాయణరెడ్డి స్వయానా సోదరుడు. బ‌ల‌మైన దేవ‌గుడి వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. జమ్మలమడుగు నియోజకవర్గంలో దేవగుడి వర్గం, రామసుబ్బారెడ్డి వర్గాల మధ్య చాలాకాలంగా ఫ్యాక్షన్‌ నెలకొంది. రామసుబ్బారెడ్డి వర్గం టీడీపీలో ఉండగా దేవగుడి వర్గం మొదట కాంగ్రెస్‌లో.. తర్వాత వైసీపీలో కొన‌సాగింది. దేవగుడి వర్గం తరఫున మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పార్టీలో చేరి మంత్రి అయ్యారు. రామసుబ్బారెడ్డిని టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీని చేసి విప్‌ పదవి ఇచ్చింది. గత ఎన్నికల్లో రామసుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా, ఆదినారాయణరెడ్డి ఎంపీగా పోటీ చేసి.. ఇద్ద‌రూ ఓడిపోయారు. ఎన్నికల తర్వాత ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరిపోగా.. రామసుబ్బారెడ్డి వైసీపీ పంచ‌న చేరారు. తాజాగా, ఆదినారాయ‌ణ‌రెడ్డి సోద‌రుడు నారాయ‌ణ‌రెడ్డితో పాటు ఆయ‌న కుమారుడు భూపేష్‌రెడ్డి టీడీపీలో చేర‌డంతో పార్టీలో రెట్టించిన ఉత్సాహం.

జమ్మలమడుగు టీడీపీకి కంచుకోట అని అన్నారు చంద్ర‌బాబు. కొందరు నాయకులు పార్టీని వీడి వెళ్లారని, జమ్మలమడుగులో పార్టీ కోసం పనిచేస్తున్న అందరికీ గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. వలస పక్షులకు ఇక పార్టీలో అవకాశం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు.. ఎవరు పనిచేయడం లేదనేది రాసిపెడుతున్నానని, ఈసారి పని చేసే వారికి మాత్రమే పార్టీలో పదవులని స్పష్టం చేశారు. పార్టీ మారి వచ్చే వాళ్లకు ఇక‌పై అవకాశం ఉండదని చంద్ర‌బాబు తెలిపారు.  

జగన్‌రెడ్డి అన్నీ గాలిమాటలు మాట్లాడుతున్నారని బాబు మండిపడ్డారు. ఇలాంటి వారు ఉంటారనే ఆనాడు అంబేడ్కర్‌ రాజ్యాంగం రాశారన్నారు. సీఎం గాల్లో వచ్చారు.. గాల్లోనే వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. సినిమా టిక్కెట్లు ఆన్‌లైన్‌లో పెట్టి అప్పు తెచ్చుకుంటారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులు అమ్ముతున్నారు, లేకపోతే తాకట్టు పెడుతున్నారు. సీఎంకు అనుభవం లేదు, అహంభావం మాత్రం ఉందని చంద్ర‌బాబు విమర్శించారు. 

కొందరే టార్గెట్? ఇదీ జగనన్న సినిమా లెక్క..