కొందరే టార్గెట్? ఇదీ జగనన్న సినిమా లెక్క..

సినిమాలకు సంబంధించి కొత్త పాలసీ తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. బెనిఫిట్ షోలను రద్దు చేసింది. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఒకటే టికెట్ రేటు ఉంటుందని స్పష్టం చేసింది. అది కూడా గతంలో కంటే టికెట్ రేట్లను భారీగా తగ్గించింది. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లు పెట్టింది జగన్ రెడ్డి సర్కార్. ప్రభుత్వ సినీ పాలసీపై సినీ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. పెద్ద నిర్మాతలు, హీరోలు ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఓపెన్ గానే స్పందించారు. టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం పుననాలోచించుకోవాలని విన్నవించారు. 

అయితే సినీమాలకు సంబంధించి జగన్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త పాలసీపై మరో చర్చ సాగుతోంది. సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని దెబ్బకొట్టాలనుకోవడం లేదని,  తమకు అండగా ఉన్న వారికి అండగా నిలిచేందుకు అధికార దుర్వినియోగం చేయడానికి సిద్ధమని సంకేతాలు పంపుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత మంత్రి పేర్నినాని చేసిన కామెంట్లు కూడా అలానే ఉన్నాయి. టికెట్ రేట్లు పెంచాలన్న చిరంజీవి ట్వీట్ పై స్పందించిన పేర్ని నాని.. టిక్కెట్ రేట్ల పెంపు జీవోలో మార్పులు చేస్తామని ప్రకటించారు. మంత్రి నాని స్పందన, ఇప్పటి వరకూ ఏపీలో జరిగిన పరిణామాలు.. తీసుకున్న నిర్ణయాలు చూస్తే సెలక్టివ్‌గా కొన్ని సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించడం ఖాయంగా కనిపిస్తుందని అంటున్నారు. 

ఏపీలో వైసీపీ ప్రభుత్వం రాగానే అన్ని కాలేజీల ఫీజుల్ని రెగ్యూలేట్ చేస్తూ ఓ కమిటీ వేసింది. ఆ కమిటీ అతి తక్కువ ఫీజులు సిఫారసు చేసింది. అ ఫీజులు గిట్టుబాటు కావనుకుంటే తమకు ధరఖాస్తు చేసుకోవాలని సదరు కమిషన్.. కమిటీ ఆదేశించింది. దరఖాస్తు చేసుకుంటే.. తమ.. మన అనుకునేవారికి ఫీజుల పెంపుకు చాన్సిస్తారు. మనోడు కాదనుకున్నవారికి అతి తక్కువ ఫీజులకే నడుపుకోవాలి. ఒక్క విద్యా సంస్థల విషయంలోనే కాకుండా ఆస్పత్రులు సహా అన్ని చోట్లా ఇదే పరిస్థితి. మనోడు అనేవాడు వ్యాపారం చేసుకోవాలి… ఇతరులు చేసుకోకూడదన్నట్లుగా ప్రభుత్వ విధానాలున్నాయి. 

ఇదే తరహాలో ఇప్పుడు తమది భారీ బడ్జెట్ సినిమా అని టికెట్ రేట్లు పెంచుకుంటామని ఎవరైనా ధరఖాస్తు చేసుకుంటే పర్మిషన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. అంటే.. సెలక్టివ్‌గా తమకు దగ్గర అనుకున్న వాళ్లో.. లేకపోతే… దగ్గరగా ఫీలయ్యేలా చేసేవాళ్లకు మాత్రమే టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. లేకపోతే తక్కువగానే ఉంటాయి. ప్రభుత్వం అన్ని సినిమాలకు ఒకలాగ కాకుండా కొన్ని సినిమాలకు ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వడం లాంటివి చేస్తే ఖచ్చితంగా దురుద్దేశం ఉన్నట్లేనని ప్రజలు అనుమానిస్తారు. ఇండస్ట్రీ కూడా చీలిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరీ జగనన్న పాలసీ ఏంటో, సినిమాలకు సంబంధించి ముందుముందు  ఏం జరుగుతుందో చూడాలి మరీ...