కేబినెట్ పునర్వ్యవస్థీకరణా, ముందస్తు ఎన్నికలా.. డైలమాలో జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలో ఏదో గాభరా కనిపిస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం తరువాత పార్టీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి బహిర్గతం అయిన తరువాత కింకర్తవ్యం అన్న భావన జగన్ లో కనిపిస్తోంది. నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసినా పెద్దగా ఫలితం కనిపించకపోవడంతో ఆయన ఏం చేయాలన్న విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్లు పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.

మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఫ్రెష్ టీంతో సిద్ధం కావాలా? లేక ముందస్తుకు వెళ్లి మళ్లీ ప్రజా క్షేత్రంలో పోరాడాలా అన్న డైలమాలో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు. గవర్నర్ తో సోమవారం(మార్చి 27) భేటీ కానీ, బుధవారం (మార్చి 29)న హస్తిన పర్యటన కానీ ఇందులో భాగమేనా అన్న అనుమానాలను పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. ఏది ఏమైనా గత మూడు నాలుగు రోజులుగా  వైసీపీలో ఏదో జరుగుతోంది? అధినేత జగన్ లో ఏమిటో తెలియని తొందర, హడావుడి, గాభరా  కనిపిస్తోంది.! ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాథ విజయం సాధించడం ఒక్కటే కాదు. అసంతృప్తులకు హెచ్చరికగా ఉంటుందని ఓ నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసినా ఫలితం లేకపోయిందన్న భావనా కాదు? నలుగురే కాదు ఇంకా చాలా చాలా మంది అసంతృప్త ఎమ్మెల్యేలు ఉన్నారంటూ వస్తున్న విశ్లేషణలూ కాదు? మరేదో ఉంది. మరేదో జరుగుతోంది. అందుకే జగన్ గాభరాగా ఉన్నారు. హడావుడి పడుతున్నారు. సోమవారం హఠాత్తుగా గవర్నర్ తో భేటీ, అది అయ్యీ అవ్వగానే హస్తిన యానానికి ఏర్పాట్లు. ఎందుకు? ఏమిటి? అన్న ప్రశ్నలు రాజకీయ సర్కిల్స్ లోనే కాదు, పార్టీ శ్రేణుల్లో కూడా జోరుగా చర్చ జరుగుతోంది.

జగన్ హస్తిన వెళ్లి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాను కలిసి వచ్చి రెండు వారాలు కూడా కాలేదు. అంతలోనే మళ్లీ బుధవారం (మార్చి 29)న మళ్లీ హస్తినకేగి వారిరువురితో భేటీ కానున్నారు. జగన్ వరుస ఢిల్లీ పర్యటనల కారణంగా వైసీపీ అధినేత జగనేనా, లేక జగన్ పార్టీకి హై కమాండ్ హస్తినలో ఉందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయని పార్టీ శ్రేణుల్లోనే చర్చ జరుగుతోంది. హఠాత్తుగా ఏ కారణం చెప్పకుండా జగన్ సోమవారం గవర్నర్ తో భేటీ కావడంతో పార్టీలోనూ రాజకీయ వర్గాలలోనూ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు జగన్ సిద్ధమయ్యారా? అన్న చర్చకు తెరలేచింది. అంతలోనే జగన్ హస్తిన పర్యటన షెడ్యూల్ బయటకు రావడంతో ముందస్తు యోచనలో ఉన్నారా అన్న అనుమానాలను పరిశీలకులలోనే కాదు, పార్టీ నాయకులలోనూ వ్యక్తం అయ్యింది.  

గవర్నర్ తో జగన్ భేటీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్ కు దారి తీసిన పరిస్థితులు, రాష్ట్రంలో రాజకీయ పరిణామాల గురించి చర్చించి ఉంటారనీ, చాలా కాలంగా జగన్ పదేపదే చెబుతూ వస్తున్న కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై అంశాలు వారి మధ్య చర్చకు వచ్చి ఉంటాయన్న ఊహాగానాలూ వినిపించాయి.   ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు మొత్తం అన్ని స్థానాలలోనూ పార్టీ అభ్యర్థులే గెలవాలి, అలా కాకపోతే వైఫల్యానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటా. అవసరం అనుకుంటే మంత్రులనూ మారుస్తా అంటూ జగన్ హెచ్చరించిన విషయాన్ని పరిశీలకులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పక్కా అన్న విశ్లేషణలు చేశారు. అంతలోనే  జగన్ మళ్లీ హస్తిన బాట పట్టడంతో  ముందస్తు చర్చ కూడా తెరమీదకు వచ్చింది.  అలాగే మళ్లీ వైఎస్ వివేకా హత్య దర్యాప్తులో సీబీఐ మళ్లీ వేగం పెంచుతోందన్న సంకేతాలు ఏమైనా వచ్చాయా  అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.