రజనీకి రేపల్లె దారి చూపుతున్న జగన్!?
posted on Nov 6, 2025 1:42PM
.webp)
ఘోర పరాజయం తరువాత కూడా జగన్ లో ఇసుమంతైనా మార్పు రాలేదు. 2024లో వైసీపీ ఘోర పరాజయానికి తన ఐదేళ్ల హయాంలో అవలంబించిన కక్ష సాధింపు రాజకీయాలు, వేధింపు చర్యలు, అభివృద్ధిని పట్టించుకోకపోవడం వంటి కారణాలతో పాటు మరో కారణం కూడా ఉంది. అదే సిట్టింగ్ ఎమ్మెల్యేలను వారి నియోజకవర్గాల నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీకి నిలబెట్టడం. అయితే ఆ విషయం ఇప్పటికీ జగన్ కు అర్ధమైనట్లు కనిపించడం లేదు. 2029 ఎన్నికలలో విజయం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్న జగన్ ఇప్పుడు కూడా నేతలను సొంత నియోజకవర్గం నుంచి కాకుండా మరో నియోజకవర్గం నుంచి పోటీలో నిలబెట్టాలని యోచిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
అందులోనూ ప్రధానంగా ప్రస్తుతం చిలకలూరి పేట నియోజకవర్గంలో పని చేసుకుంటున్న మాజీ మంత్రి విడదల రజనీని వచ్చే ఎన్నికలలో రేపల్లె నుంచి పోటీలో దింపాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని మాజీ మంత్రి విడదల రజనీకి చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో ఆమె తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికలలో కూడా చిలకలూరి పేట సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన విడదల రజనిని అక్కడ నుంచి గుంటూరు పశ్చిమకు మార్చారు. అయితే ఆమె అక్కడ విజయం సాధించలేకపోయారు.
అంతకు ముందు 2019 ఎన్నికలలో విడదల రజని చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావుపై విజయం సాధించారు. ఆ తరువాత జగన్ విడదల రజనీకి మంత్రివర్గంలో చోటు కల్పించారు. దాదాపు రెండున్నరేళ్ల పాటు ఆమె మంత్రిగా కొనసాగారు. మంత్రి హోదాలోనే గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసిన రజని ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు.
ఆమె పరాజయానికి కారణాలెన్ని ఉన్నా, ఆమె మాత్రం తనను నియోజకవర్గం మార్చడమే పరాజయానికి కారణమని భావిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతారు. ఓటమి తరువాత విడదల రజనీ మళ్లీ చిలకలూరి పేటకు వచ్చేశారు. చిలకలూరి పేట క్షేత్రంగానే ఆమె రాజకీయాలు చేస్తున్నారు. జగన్ పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. 2029 ఎన్నికలలో చిలకలూరిపేట నుంచే పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. అయితే ఇక్కడే జగన్ ఆలోచన వేరుగా ఉంది. రఆమె ఓటమి తర్వాత, రజినీ నిశ్శబ్దంగా చిలకలూరిపేటకు తిరిగి వచ్చి స్థానిక పనిని తిరిగి ప్రారంభించారు. కానీ జగన్ ఇప్పుడు రేపల్లె నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను పోటీకి దింపాలని కోరుకుంటున్నారని సమాచారం. రేపల్లె నియోజకవర్గం నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన అనగాని సత్యప్రసాద్ పై విడదల రజనిని పోటీకి నిలబెడితే.. ఆమె ఖాతాలో మరో పరాజయం జమ కావడం ఖాయమని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.