బాబు మెతక.. జగన్ ముతక!
posted on Jul 22, 2024 2:13PM
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులపై ఇప్పటికీ మెతకగా వ్యవహరిస్తున్నారన్న అసంతృప్తి తెలుగుదేశం శ్రేణుల్లో బలంగా వ్యక్తం అవుతోంది. ఎందుకు ఇంకా వారిని ఉపేక్షిస్తున్నారంటూ ఒకింత అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. వారి అసంతృప్తి, అసహనం కరక్టే అనేలా వైసీపీ నేతలు, మరీ ముఖ్యంగా జగన్ తీరు ఉంది. ఏపీలో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టి 45 రోజులు అయ్యింది.
ఇప్పటికీ చంద్రబాబు జగన్ హయాంలో హద్దులు మీరిన అధికారుల పట్ల, ఇష్టారీతిగా చెలరేగి వ్యవహరించిన వైసీపీ నేతలు, క్యాడర్ పట్ల క ఠినంగా వ్యవహరించడం లేదన్న భావన మెజారిటీ తెలుగుదేశం క్యాడర్ లో వ్యక్తం అవుతోంది. అందుకు తగ్గట్టుగానే ఓటమి తరువాత కూడా వైసీపీ నేతలూ మరీ ముఖ్యంగా జగన్ వ్యవహరిస్తున్న తీరు ఉంటోంది. అసెంబ్లీ వద్ద జగన్ సోమవారం (జులై 24) వ్యవహరించిన తీరును చూస్తే తెలుగుదేశం క్యాడర్ లో అసహనానికి అర్ధం ఉందని అనిపించక మానదు.
కేవలం 11 మంది సభ్యుల బలంలో అసెంబ్లీలో విపక్ష హోదా కూడా దక్కని వైసీపీ పట్ల చంద్రబాబు సర్కార్ ఉదారంగా వ్యవహరించింది. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ప్రస్తుత అసెంబ్లీలో ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఆయనకు విపక్ష నేత హోదా లేదు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడానికి ఆయన అందరు ఎమ్మెల్యేల్లాగే నాలుగో నంబర్ గేటు వద్ద కారు దిగి నడిచి అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశించాలి. కానీ వైసీపీ సభ్యుల వినతి పట్ల సానుకూలంగా స్పందించిన చంద్రబాబు జగన్ కు ఓ మినహాయింపు ఇచ్చారు. ఆయన తన వాహనంలోనే అసెంబ్లీలో కి నాలుగో నంబర్ గేట్ గుండా ప్రవేశించే వెసులుబాటు కల్పించారు.
అయితే జగన్ వ్యవహరించిన తీరు ఆయనా గౌరవానికి అర్హుడుకాడని మరో సారి రుజువు చేసుకున్నారు. అసెంబ్లీ ప్రధాన ద్వారం గుండానే లోపలకు ప్రవేశిస్తానంటూ పోలీసులతో ఘర్షణకు దిగారు. అయితే ఆయనను వేరే గేటుగుండా రావాల్సిందిగా పోలీసులు సూచించారు. ప్రధాన గేటు గుండా గవర్నర్ వచ్చే సమయం ఆసన్నమైనందున ఆ గేటుగుండా వైసీపీ నేతను అనుమతించే ప్రశక్తే లేదని విస్ఫష్టంగా చెప్పారు. దీంతో జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి నిరసనకు దిగారు. సేవ్ డెమొక్రసీ, పోలీస్ డౌన్ డౌన్ అంటూ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అయితే జగన్ ను, వైసీపీ ఎమ్మెల్యేలనూ పోలీసులు ప్రధాన గేటు గుండా అసెంబ్లీలోకి వెళ్లేందుకు అనుమతించలేదు. దీంతో వారు వేరు గేటుగుండా అసెంబ్లీలోకి వెళ్లారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో జగన్ అనవసరపు రాద్ధాంతం చేసి తనలో ఇసుమంతైనా మార్పు రాలేదని చాటుకున్నారు. గౌరవం ఇవ్వడమే కాదు, తీసుకోవడం కూడా ఆయనకు తెలియని రుజువు చేసుకున్నారు. అసెంబ్లీలో కూడా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటూ వైసీపీ నినాదాలతో హోరెత్తించడానికి ప్రయత్నించి విఫలమై సభ నుంచి వాకౌట్ చేసింది. ఇదిగో జగన్ ఇలాంటి వైఖరిని ఎత్తి చూపుతూనే చంద్రబాబు తన మెతక తనాన్ని వీడి కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.