జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందే!
posted on Sep 27, 2025 12:27PM

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ కు నాంపల్లిలోని సీబీఐ కోర్టు యూకే పర్యటనకు అనుమతి ఇచ్చింది. అధికారం కోల్పోయిన తరువాత నుంచీ జగన్ ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమౌతూ అడపాదడపా ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు. పార్టీ నాయకులతో భేటీలు నిర్వహించి మళ్లీ యహలంక ప్యాలెస్ కు వెడిపోతున్నారు. కాగా ఈ నేపథ్యంలోనే జగన్ అక్రమాస్తుల కేసులో వ్యక్తిగతంగా కోర్టు హాజరు నుంచి ఇంకా ఎంత కాలం మినహాయింపు అంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో జగన్ తన యూరప్ పర్యటనకు అనుమతి కోరుతూ నాంపల్లిలోని సీబీఐ కోర్టును ఆశ్రయించారు. నాంపల్లి సీబీఐ కోర్టు జగన్ యూరప్ పర్యటనకు అనుమతి ఇచ్చింది. వచ్చే నెల 1 నుంచి 30వ తేదీ లోపు 15 రోజుల పాటు జగన్ యూరోప్ పర్యటనకు అనుమతి మంజూరు చేసిన కోర్టు, ఆ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తరువాత నంవంబర్ 14లోగా వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
జగన్ అక్రమాస్తుల కేసులో ఇది కీలక పరిణామమని పరిశీలకులు అంటున్నారు. అది పక్కన పెడితే గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత జగన్ యూరోప్ పర్యటనకు వెళ్లడం ఇది రెండో సారి అవుతుంది. కాగా జగన్ వ్యక్తిగత హాజరు మినహాయింపునకు ఇక తెరపడినట్లేనన్న చర్చ రాజకీయవర్గాలలో వినిపిస్తున్నది. అధికారంలో ఉన్నప్పుడు లభించిన మినహాయింపు అధికారం కోల్పోయిన తరువాత కూడా కొనసాగుతుండటం పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో నాంపల్లి కోర్టు నవంబర్ 14లోగా కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా జగన్ యూరోప్ పర్యటనకు అనుమతి కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్ సందర్భంగా సీబీఐ అనుమతి ఇవ్వరాదంటూ గట్టిగా అభ్యంతరం తెలిపింది.
పలు ఆర్థిక నేరాల కేసులలో నిందితుడిగా ఉన్న వ్యక్తి విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దంటూ ఆదేశించింది. కాగా జగన్ ఎన్నడూ కోర్టు షరతులను ఉల్లంఘించలేదంటూ జగన్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలూ విన్నమిదట.. కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇస్తూ పలు షరతులు విధించింది. జగన్ తన పర్యటన పూర్తి వివరాలను కోర్టుకు, సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది. అలాగే యూరప్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత నవంబరు 14వ తేదీలోపు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై స్వదేశానికి ఎప్పుడు తిరిగి వచ్చారో స్పష్టం చేస్తూ మెమో సమర్పించాలని ఆదేశించింది.