లడక్.. నాడు సంబరాలు.. నేడు ఆగ్రహ జ్వాలలు కారణమేంటి?
posted on Sep 27, 2025 3:06PM

సరిగ్గా ఆరేళ్ల కిందట లడక్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. పండుగ జరుపుకున్నారు. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకాశ్మీర్ నుంచి విడిపోయి కేంద్రపాలిత ప్రాంతంగా లడక్ ఏర్పడాలన్న తమ స్వప్నం సాకారమైందంటూ అనందంతో పరవశించిపోయారు అయితే సరిగ్గా ఆరేళ్లు తిరిగే సరిగి.. లడక్ ఇప్పుడు ఆందోళనలతో అట్టుడికిపోతోంది. నిరసనలు హింసాత్మక రూపం దాల్చాయి. పోలీసు కాల్పులతో మరణాలు సంభవించాయి. ఆంక్షలు, కర్ఫ్యూలతో లడక్ ఉద్రిక్తంగా మారిపోయింది. ఆరేళ్ల నాటిసంబరాలు ఆవిరై ఇప్పుడు ఆగ్రహజ్వాలలుగామారడానికి కారణమేంటి? పరిస్థితి ఇలా మారడానికి వెనుక ఎవరున్నారు? అసలు లడక్ ప్రజలు కోరుకుంటున్నదేమిటి?
ఈ ప్రశ్నలకు లడక్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చేయడంతోనే వారి డిమాం డ్లన్నీతీరిపోయినట్లేనని కేంద్రం భావించడమే ఇప్పటి ఈ పరిస్థితికి కారణమన్నదే సమాధానంగా వస్తున్నది. ఎందుకంటే లడక్ ప్రజలు తమ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా అంటే యూనియన్ టెరిటరీగా మార్చడం పట్ల వ్యక్తం చేసిన ఆనందం, చేసుకున్న సంబరాలు ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా పడిన మొదటి అడుగుగా భావించడమేనని పరిశీలకులు అంటున్నారు. స్థానిక పాలన, తమ సాంస్కృతిక ప్రత్యేకతలను కాపాడుతూ లడక్ ను రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ లో చేర్చడం, స్థానికులకు ఉద్యోగాలు, భూ యాజమాన్యంలో ప్రత్యేక రిజర్వేషన్లు వంటి ఆకాంక్షలు ఉన్నాయి.
యూనియన్ టెరిటరీగా మార్చి జమ్మూ కాశ్మీర్ నుంచి విడిపోవడం ఆ ఆకాంక్షల సాకారం దిశగా పడిన తొలి అడుగుగా భావించి లడక్ ప్రజలు ఆరేళ్ల నాడు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. అయితే ఈ ఆరేళ్లలో ఆ తొలి అడుగుతరువాత మరో అడుగు ముందుకు పడకపోవడం లడక్ ప్రజలలో అసహనానికి కారణమైంది. అందుకే ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆందోళనకారులు జరిపిన చర్చలు విఫలం కావడం అసహనాన్ని మరింత పెంచింది. ముఖ్యంగా లేహ్‌లోని బౌద్ధులు, కార్గిల్‌లోని షియా ముస్లింలు ఐక్యంగా ఆందోళనలకు ముందు పీఠిన నిలిచాయి.
ఈ నేపథ్యంలో ప్రత్యేక లడక్ రాష్ట్రం కోసం శాంతియుతంగా నిరశన చేస్తున్న వారిని బలవంతంగా ఆస్పత్రికి తరలించడం, ఆందోళనను అణిచివేయడానికి పోలీసులను నియోగించడం,మరో సారి చర్చలంటే ఇప్పుడప్పుడే కాదని కేంద్ర మొండికేయడం వంటివి ఆందోళనకారులలో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తడానికి కారణమయ్యాయి. సరిగ్గా ఈ దశలోనే ఆందోళన యువత చేతుల్లోకి వెళ్లిపోయింది. అంటే రాహుల్ పదేపదే చెప్పే జెన్ జడ్ రంగంలోకి దిగిందన్న మాట. ఈ దశలోనే ఆందోళన హింసాత్మక రూపం దాల్చడం, దాడులు, పోలీసు కాల్పుల వరకూ పరిస్థితి వెళ్లింది.
లేహ్, కార్గిల్‌లలో ‘అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్స్ ద్వారా ప్రత్యేక రాష్ట్రానికి ఉండే అన్నీ కల్పిస్తున్నామంటూ కేంద్రం చేస్తున్న వాదనను లడక్ వాదులు అంగీకరించడం లేదు. కౌన్సిల్స్‌కు లెఫ్టినెంట్ గవర్నర్ కింద పరిమిత అధికారాలే ఉన్నాయని వాదిస్తున్నారు. లడక్ ప్రాంతం దేశ భద్రతకు సంబంధించినంతవరకూ అత్యంత సున్నితమైన, కీలకమైన ప్రాంతం అనడంలో సందేహం లేదు. ఇప్పటి పరిస్థితుల్లో లడక్ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించడమూ జరిగే పని కాదు.. కానీ.. ప్రజల ఆకాంక్షలను అణచివేయాడం సరికాదు. వారితో చర్చల ప్రక్రియ కొనసాగిస్తూనే.. రాష్ట్ర హోదాకు ప్రత్యామ్నాయంగా కౌన్సిల్స్ అధికారాలను పెంచి, ఉద్యోగ, భూమి హక్కులపై స్పష్టమైన హామీలు ఇస్తే.. ప్రజాగ్రహం చల్లారే అవకాశం ఉంటుంది. ఆ దిశగా అడుగులు వేయకుంటే లడక్ నిత్యాగ్ని గుండంలా మండుతూనే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.