బాబును కెలికి జగన్ తప్పు చేశారా?
posted on Oct 4, 2023 5:10PM
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి జగన్ వున్నారా? అందుకే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారా? అయితే ముందస్తుకు ప్రధాని గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? సోషల్ మీడియాలో బాగానే ముందస్తు ఎన్నికలపై చర్చ అయితే జరుగుతోంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తుకు వెళ్తేనే.. టీడీపీని నిర్వీర్యం చేసి, తిరిగి అధికారంలోకి రావొచ్చని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన గుట్టుచప్పుడు కాకుండా మంత్రులు, వైసీపీ నేతలతో రహస్య సమావేశం నిర్వహించారట. ఇప్పుడున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా తాను ఎంతగానో నమ్మే, ఆరాధించే స్వరూపానంద సరస్వతిని జగన్ కలిశారట... అసెంబ్లీ రద్దుకు మంచి ముహూర్తం గురించి చర్చించారని తాడేపల్లిలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజానికి.. గ్రౌండ్ రిపోర్ట్ చూస్తే, వైసీపీ ప్రభుత్వంపై ఏపీ ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. ఇంత వరకూ రాజధాని లేకుండా ఏపీని ఏకాకి చేయడం, ప్రాజెక్టులు లేకుండా దిక్కుమాలిన రాష్ట్రంగా మార్చడం, పథకాలు పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడంతో.. జగన్ సర్కార్‌పై రాష్ట్ర ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి తమకు భవిష్యత్తే లేకుండా చేశాడని జగన్‌పై ఏపీ జనం తీవ్రంగా మండిపడుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయి. దీనికి తోడు.. వాలంటీర్ వ్యవస్థలోని పాపాల గుట్ట కూడా బయటపడటంతో, జగన్ ప్రభుత్వం ఇరుకున పడింది. ఇక నవరత్నాలను ఎలా నిర్వీర్యం చేశారో అందరికీ తెలిసిందేగా! మద్యపానం నిషేధం పేరుతో ఇంకా మద్యం అమ్మకాలు పెంచి పేదలను ఇబ్బంది పెట్టడమే కాకుండా మద్యం ద్వారా వచ్చే నిధులను పక్కదారి పట్టిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి తనపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేసేందుకు జగన్ ‘స్కిల్ డెవలప్‌మెంట్’ కేసుని తెరమీదకు తీసుకొచ్చి, చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేయించారు. ఇప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా ఏపీ ప్రజల్ని రెచ్చగొట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఒకవేళ టీడీపీపై అవినీతి బురదజల్లి, ప్రజల్ని నమ్మించడంలో సక్సెస్ అయితే.. అప్పుడు ముందస్తుకు వెళ్లడమే నయమని జగన్ ఉద్దేశంగా తెలుస్తోంది. టీడీపీని నిర్వీర్యం చేస్తే.. తమకు అనుకూలంగా ఓట్లు పడతాయని, ఫలితంగా మరోసారి అధికారాన్ని చేపట్టవచ్చని జగన్ కలలు కంటున్నారని వాస్తవ పరిస్థితులు భిన్నంగా వున్నాయని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు తెలుగుఒన్ తో అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జగన్‌కు ఘోరపరాభవం తప్పదని ఆయన విశ్లేషించారు. ఏపీలో మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాలు వస్తాయని, శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందని ఆయన విశ్లేషించారు. వివేకా హత్య కేసును పక్కదారి పట్టించి చంద్రబాబు అరెస్టుపైనే రాజకీయం నడిపిస్తున్నారని.. కానీ ఏపీ ప్రజలు వివేకా హత్య కేసును మరిచిపోలేదని ఆయన పేర్కొన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లేంత సాహసం జగన్ చేయలేరని.. ఒకవేళ వెళ్లినా ఆయనకు ఘోర పరాభవం తప్పదని జోస్యం చెప్పారు.
తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని టీడీపీ నేతల్ని భయపెట్టేలా అరెస్ట్‌ల పరంపర కొనసాగుతోంది. అందులో భాగంగానే బండారును అరెస్టు చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చూసినట్లైతే టీడీపీ లో హల్‌చల్ చేసిన మంత్రులు ముగ్గురున్నారు. వారిలో ఒకరు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అయితే,మరొకరు గంటా శ్రీనివాసరావు. వీరి మధ్యలో అంటే 1998 ప్రాంతంలో ఒక్కసారి మంత్రి చేశారు బండారు సత్యనారాయణమూర్తి. ఇలా ఈ ముగ్గురూ త్రిమూర్తులుగా ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీ పాలిటిక్స్ ని నడిపిస్తున్నారు. ఇందులో మొదట అరెస్ట్ చేసింది అయ్యన్నపాత్రుడిని. ఆయన మీద దాదాపుగా పదిహేను కేసులు వైసీపీ ప్రభుత్వం పెట్టింది. అయ్యన్న అరెస్ట్ ని పోలీసులు చూపించినా స్టేషన్ బెయిల్ తో ఆయన బయటకు వచ్చారు. గడచిన నాలుగున్నరేళ్ళుగా అనేక సందర్భాలలో అయ్యన్నపాత్రుడు ప్రభుత్వం పైన, జగన్ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. దాంతో ఆ విధంగా ఆయన మీద పెట్టిన కేసులే ఎక్కువగా ఉన్నాయి.
ఇక ఆయన తరువాత బండారు సత్యనారాయణమూర్తి వంతు వచ్చింది. బండారు మీడియా మీటింగ్స్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నా డోస్ ఎపుడూ ఒక స్థాయిలోనే ఉండేది. అలాంటి బండారు ఇటీవల సడెన్ గా మహిళా మంత్రి రోజా మీద రెచ్చిపోయారు. దాంతో ఆయన మీద రెండు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. బెయిల్ మంజూరవ్వడంతో ఆయన బయటికి వచ్చారు.
ఇపుడు బండారు తరువాత ఎవరు అరెస్ట్ అవుతారు అన్నది విశాఖ జిల్లాలో చర్చ జరుగుతోంది. త్రిమూర్తులలో ఇద్దరు అయిపోయారు కాబట్టి మూడవ షాట్ మాజీ మంత్రి గంటా కే అని అంటున్నారు. గంటా ఇటీవల కాలంలో ప్రభుత్వం మీద గట్టిగా నోరు చేసుకుంటున్నారు.
ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొనే ముఖ్యమంత్రి జగన్ తనదైన స్టైల్‌లో టీడీపీని టార్గెట్ చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు. రాజకీయాల్లో భాగంగా ముఖ్యమంత్రి దూకుడుగా వ్యవహరించడాన్ని ఆంధ్రప్రజలు జాగ్రతగా గమనిస్తున్నారు. అధికార పార్టీ చేసే కుట్రలు..... టీడీపీ నేతలకు, ప్రజలకు, కార్యకర్తలకు అర్థమైపోయింది. చంద్రబాబును జైలుకు పంపి.. టీడీపీని ఏదో చేద్దామనుకుంటున్నారన్న స్పష్టత అందరికీ ఉంది. అన్ని రకాల వ్యవస్థల్నీ మేనేజ్ చేస్తున్నారని అర్థమవుతోంది.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఏమాత్రం భయపడడం లేదు. భరించాల్సిన నష్టాలను.. కష్టాలను ఇప్పటికే భరించామని, ఇప్పుడు కొత్తగా పోయేదేమీ లేదని టీడీపీ క్యాడర్ తెగించి పోరాడుతోంది. చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలుగు వాళ్లు ఉన్న ప్రతీ దేశంలోనూ నిరసనలు జరుగుతూనే వున్నాయి. అందరూ ఎవరికి వారు మాట్లాడుకుని నిరసనలు చేశారు. ఏపీలో తీవ్రమైన కట్టడి మధ్య ప్రజలు బయటకు వస్తున్నారు. టీడీపీని ముక్కలు చేయడానికి కుట్ర జరుగుతోందని, కాపాడుకోవాలన్న సంకల్పం టీడీపీ క్యాడర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబుపై నమ్మకం ఎక్కడా సడలిపోవడం లేదు. ఎదురొడ్డి నిలబడుతున్నారు. ఒక్క నేత కూడా వెనక్కితగ్గలేదు. దీనికి తోడు సర్వే రిపోర్ట్స్ కూడా టీడీపీకి అనుకూలంగా రావడంతో ఇతర పార్టీల నేతలు టీడీపీలోకి చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో చేరబోతున్నారు. వైసీపీలోని మరికొంత మంది నేతలు కూడా టీడీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారట. వైసీపీ నుంచి టికెట్ మళ్ళీ రాదనుకున్న నేతలంతా టీడీపీతో టచ్‌లోనే వున్నారట.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీని ఏదో చేద్దామనుకున్నారు కానీ… గ్రౌండ్ లెవెల్‌లో చూస్తే టీడీపీ మరింత బలం పెంచుకుంది. ఇక్కడ ఓ విషయం మనం గుర్తు చేసుకుంటే, అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ ప్రస్తుత సి.ఎం. జగన్ మోహన్ రెడ్డిని అరెస్టు చేసినప్పుడు అప్పట్లో ఒక్కరు కూడా రోడ్లపైకి రాలేదు. కుటుంబసభ్యులు మాత్రమే రోడ్డుపై ధర్నా చేశారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఊళ్ల కు ఊళ్లు కదులుతున్నాయి. టీడీపీ గ్రాఫ్ కూడా బాగా పెరిగిందని ఇంటలిజెన్స్ సర్వేల్లో కూడా వచ్చిందట. ఆ విషయాన్ని పక్కదారి పట్టించడానికే తనకు అనుకూలంగా ముఖ్యమంత్రి సర్వే చేయించుకున్నారనే తాడేపల్లిలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
చంద్రబాబు అరెస్టు తరువాత జరుగుతున్న పరిణామాల్ని కనుక గమనిస్తే, టీడీపీ, జనసేన మధ్య పూర్తి స్థాయిలో ఫెవికాల్ బంధం ఏర్పడింది. టీడీపీ, జనసేన క్యాడర్ కలిసిపోయాయి. రాష్ట్రమంతా కలిసే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎక్కడా రెండో అభిప్రాయానికి చోటు లేకుండా … జగన్ ప్రభుత్వంపై పోరాటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పవన్ వారాహి యాత్రలో టీడీపీ క్యాడర్ సందడి చేస్తుంది. పవన్ కూడా టీడీపీ, జనసేన మధ్య బంధం ఎంత బలంగా ఉందో తేల్చి చెప్పేశారు. చిచ్చు పెట్టాలని ప్రయత్నించిన వైసీపీ కనీస ప్రయోజనం లభించలేదు. బలంపై స్పష్టమైన అవగాహనతో ఉన్న జనసేనానికి ఏపీ రాజకీయాలపై ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చింది. వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారు. పవన్ రాజకీయంగా రాటుదేలారని జనం కూడా చెప్పుకుంటున్నారు.
మరో వైపు టీడీపీ, జనసేన మధ్య బంధం.. లీడర్లు, క్యాడర్ స్థాయిలో బాగానే కలిసిపోయింది. జనసేనకు క్యాడర్ ఉంది. ఓట్లు వేసే ఫ్యాన్స్ ఉన్నారు . కానీ బలమైన నేతలు పరిమితంగానే ఉన్నారు. టీడీపీకి లీడర్, క్యాడర్ ఉన్నారు. ప్రణాళికాబద్దంగా వీరు పని చేసుకుంటే.. మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాలు వస్తాయి. పొత్తులు ఇప్పుడున్న రీతిలో కొనసాగిస్తే శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ వైసీపీకి సింగిల్ డిజిట్ మాత్రమే వస్తుందని ఇటీవల వచ్చిన తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.