జగన్ పై టీడీపీ మంత్రుల విమర్శలు.. లేనిపోని తలనొప్పులు
posted on Oct 12, 2015 11:13AM
.jpg)
వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ గుంటూరు సమీపంలో నల్లపాడు వద్ద చేపట్టిన దీక్ష ఈరోజుతో ఆరవ రోజుకి చేరుకుంది. అయితే జగన్ దీక్ష చేపట్టిన రెండు రోజులు అధికార పార్టీ నేతలు విమర్శలు గుప్పించిన తరువాత అంతగా పట్టించుకోలేదు. కానీ జగన్ దీక్ష గురించిన సమాచారం సేకరిస్తూనే ఉన్నారు. కాని ఇప్పుడు అనవసరంగా జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇబ్బందులు తెచ్చుకుంటున్నారనే వార్తులు గుప్పిస్తున్నాయి. రెండు మూడు రోజులు సైలెంట్ గా ఉన్న టీడీపీ నేతలు మళ్లీ ఇప్పుడు జగన్ దీక్షపై విమర్శలు చేసి కొత్త తలనొప్పులు తెచ్చుకున్నట్టు తెలుస్తోంది. జగన్ రెండుగంటలకు ఒకసారి బస్సులోకి వెళ్లి ఆహారం తీసుకుంటున్నారని..షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు టీడీపీ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై అందరూ మండిపడుతున్నారు. దీక్షకు సహకరించపోయిన పర్వాలేదు కాని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అంటున్నారు. మరోపక్క టీడీపీ నేతలు ఇలా మాట్లాడి జగన్ పై ఇంకా సింపతి వచ్చేట్టు చేశారని.. అంతేకాదు వారు చేసిన వ్యాఖ్యలకి వైకాపా శ్రేణుల్లో ఇంకా కొత్త ఉత్సాహాన్నిఇచ్చాయని పలువురు రాజకీయ వర్గాలు తెలుపుతున్నాయి.