జగన్ పై జనాగ్రహం.. రాజకీయాల్లో తప్పటడుగులు

 

'నరం లేని నాలుక ఎన్ని రకాలైనా మాట్లాడుతుంది' అంటారు.. ఈ సామెత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి బాగా సూటవుతుంది. అసలు జగన్ రాజకీయాలు చూస్తుంటే ఎవరైనా ముక్కునవేలేసుకోవాల్సిందే. ఏదో చేద్దామనుకొని ఇంకేదో చేసి తానే తప్పటడుగులు వేస్తున్నారు. మరీ ఎక్కువ రాజకీయాలు చేసి అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రాలోనూ ఎటూకాకుండా పోతారేమో అనిపిస్తోంది. ఎందుకంటే తెలంగాణ సీఎంకు జగన్ మద్దతివ్వడంతో ఇప్పటికే ఆంధ్రా వాళ్లు జగన్ మీద ఫుల్ ఫైర్ అవుతున్నారు. దీనిలో భాగంగా ఓటుకు నోటు కేసులో చంద్రబాబు మీద అక్కసుతో జగన్ మోహన్ రెడ్డి పలికిన ప్రతి మాట కేసీఆర్ కు మద్దతిచ్చేదిగా ఉండటంతో జగన్ పై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. ఎలాగైనా చంద్రబాబును ఓటుకు నోటు కేసులో ఇరికించాలని తెగ తాపత్రయపడుతున్నారు కానీ.. మరో కోణంలో ఆంధ్రా వారినుండి వ్యతిరేకత వస్తుందని ఆలోచించలేక పోయారు.

 

 

ఇప్పుడు ఎలాగో మేలుకొని ఏపీ ప్రజల వ్యతిరేకతను గుర్తించారేమో జగన్ సడన్ గా పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి లేఖ రాశారు. కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేసినప్పుడు మౌనంగా ఉన్న జగన్ కు అప్పుడు గుర్తుకురాని అనుమతులు ఇప్పుడు అంత సడెన్ గా ఎందుకు గుర్తోచ్చాయో? ఎందుకంటే ఆ రకంగా ఏదో తెరాసకు వ్యతిరేకం అని చెప్పుకోవడానికే అన్నట్టు ఉంది. అప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు ఆపాలంటూ కేంద్రమంత్రులందరినీ కాకా పట్టిన జగన్ ఇప్పుడు ఏదో నామమాత్రంగా పాలమూరు ప్రాజెక్టుపై ఓ లేఖ రాసి చేతులు దులుపుకున్నారు. ఎందుకంటే ఎలాగూ అటూ ఆంధ్రాలో జనాలు జగన్ మీద ఆగ్రహంగా ఉన్నారు.. ఏదో ఇలా చేస్తే తాను కూడా టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్నానని తెలపడానికి ఏదో చిన్న ప్రయత్నం చేశారు. ఏదీ ఏమైనా జగన్ మాత్రం ఓ కన్ప్యూజన్ స్టేట్ ఉన్నట్టు మాత్రం తెలుస్తోంది. ఒకవేళ చంద్రబాబు మీద కోపంతో తెరాసకు మద్దతిస్తే ఇటు ఆంధ్రాలో పూర్తి వ్యతిరేకతను చూడాల్సి వస్తుంది. మరోవైపు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడితే అసలే అక్కడ అంతంత మాత్రంగా ఉన్న పార్టీ తట్టాబుట్టా సర్దుకొని రావాల్సి ఉంటుంది. చివరికి ఏదో చేయబోయి జగన్ తన చేతులు తానే కాల్చుకుంటాడేమో.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu