వాలంటీర్లకు జగన్ హ్యాండ్
posted on Sep 25, 2025 2:33PM
.webp)
పుట్టింటోళ్లు తరిమేశారు.. కట్టుకున్నోళ్లూ వదిలేశారన్నట్టుగా మారింది పాపం వాలంటీర్ల పరిస్థితి. ఫైనల్ గా మేమొచ్చాక మీకంటూ ఒక భరోసా ఇస్తామన్న కోణంలో వీరికి ఊరట కల్పించాల్సిన వీరి సృష్టికర్త జగన్.. కాస్తా.. వీరికి మొండి చేయి చూపించేశారు. ఇప్పటి వరకూ నేను చేసిన అతి పెద్ద తప్పిదం వాలంటీర్లను నమ్మడం అన్న ఒక నిర్ణయానికి వచ్చి ఆ దిశగా కొన్ని కీలక కామెంట్లు చేశారు. అవేంటో చూస్తే.. వైసీపీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన జగన్ తన ఐదేళ్ల పాలనలో వాలంటీర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వల్లే నష్టపోయినట్టు అభిప్రాయ పడ్డారాయన. గతంలో వాలంటీర్లకు అవసరానికి మించి ప్రయారిటీ ఇవ్వడమే కొంప ముంచినట్టు తేల్చి చెప్పేశారు. వీరి కారణంగా గ్రామ, మండల స్థాయి కార్యకర్తలను విస్మరించామని.. ఇదే తమ పార్టీ ఓటమికి ప్రధానకారణంగా చెప్పుకొచ్చారు జగన్.
ఈ సారికి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకే అధిక ప్రాధాన్యత ఇస్తాననీ, ప్రభుత్వ పథకాలన్నీ వాళ్ల ద్వారానే ప్రజలకు చేరవేసేలా చేస్తామనీ కార్యకర్తలను ఊరడించేలా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. కార్యకర్తలే అన్నింటా క్రియాశీలకంగా పని చేస్తారని అన్నారు జగన్. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్ధవంతంగా ఎదుర్కోవల్సి ఉందని అన్నారు. లోకల్ ఫైట్ కి అందరూ సన్నద్ధం కావాలని కూడా పిలుపునిచ్చారాయన.
దీన్ని బట్టి చూస్తుంటే.. జగన్ తన కార్యకర్తలను బిస్కెట్ వేయడంలో భాగంగానే ఈ కామెంట్లు చేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు వాలంటీర్లకు హ్యాండ్ ఇవ్వడాన్ని బట్టీ చూస్తే జగన్ మడమ తిప్పం, మాట తప్పం అనే పదాలు కేవలం వైసీపీ సోషల్ మీడియా వింగులు రాసుకోడానికి తప్ప ఎందుకూ పనికి రావన్న కామెంట్లు ఒకింత జోరుగానే వినిపిస్తున్నాయ్.