ముఖ్యమంత్రి జగన్ రాజీనామా చేస్తారా?

చట్టం ముందు అందరూ సమానమే కానీ, రాజకీయ నాయకులు కొంచెం ఎక్కువ సమానమని సామాన్యులు అనుకుంటే, కాదనేందుకు కారణాలు కనిపించవు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ మొదలై, ఇంచుమించుగా పుష్కరకాలం పూర్తయింది. అయినా, విచారణ సాగుతూనే వుంది.. ఓ వంక రాజకీయ నాయకుల మీద వున్న కేసులును విచారణ వేగంగా పూర్తి చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఎప్పుడోనే చెప్పిందంటారు.కానీ, వాస్తవంలో ఏమి జరుగుతున్నదో వేరే చెప్పనక్కరలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ క్రతువు చూస్తే, చట్టం ముందు అందరూ సమానం కాదు అనుకోవలసి వస్తుందని సామాన్యులు అనుకుంటున్నారు. 

నిజానికి జగన్మోహన్ రెడ్డి మీద ఒకటి కాదు, 11 ఈడీ కేసులు, 12 సీబీఐ కేసులు మొత్తం 23  కేసులున్నాయి. అయినా ఆయన రాజకీయ,ఆర్థిక,వ్యాపార కార్యకలాపాలు ఎలాంటి అవరోధం లేకుండా సాగిపోతున్నాయి.ఓ పదహారు నెలలు జైల్లో ఉన్నా, బెయిలు పై బుయటకు వచ్చిన తర్వాత ఐదేళ్ళు ప్రతిపక్ష నేతగా ఇప్పుడు రెండున్నరేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని, కోర్టు విచారణకు హాజరు కాకుండా మినహయింపు పొందుతున్నారు. ఈ మినహాయింపు వలన విచారణ మరింత జాప్యం అవుతోంది సీబీఐ న్యాయస్థానానికి తెలిపింది.ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ.. తెలంగాణ హైకోర్టుకు విన్నవించింది. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. దీంతో ఈ కేసులోఏం తీర్పు రాబోతుందన్నది ఆసక్తిగా మారింది. సీఎం జగన్ విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం అదేశిస్తే ఈ కేసులో కీలక పరిణామాలు జరగవచ్చని తెలుస్తోంది.

విచారణ సందర్భంగా సీబీఐ న్యాయవాది పలు అంశాలు న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. గతంలో జగన్ ఇదే అభ్యర్థన చేస్తే సీబీఐ కోర్టు, హైకోర్టు నిరాకరించాయని తెలిపారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ అభిప్రాయపడింది. ఈ కారణంగానే గతంలో ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు నిరాకరించినట్టు కోర్టుకు వివరించి  ప్రస్తుతం జగన్ హోదా మరింత పెరిగిందని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నందున సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ స్పష్టం చేసింది.ఈ నేపద్యంలో కోర్టు ఎలా ఉంటుంది అనేది అత్యంత కీలకంగా మారిందని అంటున్నారు. తీర్పు తిరగబడితే రాజకీయంగా తీవ్ర పరిణామాలు తప్పవని అంటున్నారు.  

హై కోర్టులో తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏమి చేయాలనే దానిపై ఇప్పటికే,  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు అవకాశం ఉన్నాఆమార్గంలో వెళ్లరాదని, నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిశోర్ వ్యూహంలో భాగంలో అ వసరం అయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు కూడా ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వెల్లువెత్తుతున్న ప్రభుత్వ వ్యతిరేకతకు ముఖ్యమంత్రే కేంద్ర బిందువుగా ఉన్నారు. మంత్రులు సలహాదారులు ఎందరున్నా, ప్రభుత్వ పాలనా సింగిల్ మ్యాన్ షో గానే సాగుతున్న నేపధ్యంలో, పేస్ మారిస్తే ప్రయోజనం ఉంటుందని  పీకే. జగన్ ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఈ ఆలోచనకు కొనసాగింపుగా  కోర్టులకు సహకరించడం ద్వారా జగన్ వ్యక్తిగత ఇమేజిని పెంచుకునే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే, బీహారు మాజీ  ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రూట్ లో శ్రీమతి భారతిని ముఖ్యమంత్రి చేయడం కాదంటే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత రూట్లో, నమ్మినబంటుకు బాధ్యతలు అప్పగించి రిమోట్ కంట్రోల్ పాలన చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే  ఏదైనా, అంతిమ నిర్ణయం హై కోర్టు తీర్పు మీద ఆధారపడి ఉంటుందని అంటున్నారు.