ఏపీ ఉద్యోగుల మీద కక్ష సాధిస్తున్న జగన్ సర్కారు

ఏపీ సర్కారు మరోసారి తన కురుచ బుద్ధిని చాటుకుంది. ఉద్యోగుల పట్ల నిరంకుశ వైఖరిని బయటపెట్టుకుంది. చంద్రబాబు హయాంలో ఉద్యోగులపై ప్రదర్శించిన ఔదార్యం కాస్తా ఇప్పుడు కాఠిన్యంగా మారింది. జగన్ తీసుకున్న నిర్ణయం కారణంగా సచివాలయ ఉద్యోగులు, హెచ్.ఒ.డి లు ఆందోళనకు గురవుతున్నారు. తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ నిర్ణయమేంటంటే.. హైదరాబాద్ లో స్థిరడ్డ ఏపీ ఉద్యోగుల సేవలు వినియోగించుకునేలా వారిని అమరావతిలోనే ఉండేలా ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత వసతి, ఉచిత రవాణా సదుపాయాలు కల్పించారు. వారానికి ఐదు రోజుల పనిదినాలు కల్పిస్తూ.. ఆ ఐదు రోజుల వసతిని కూడా ప్రభుత్వమే భరించింది. అది కాస్తా వచ్చే నవంబర్ 1 నుంచి రద్దయిపోతుంది. 

అమరావతిలో రాజధాని నిర్మాణం, నూతన సచివాలయం, పరిపాలనా విధులు.. ఇలా అనేక ప్రభుత్వ వ్యవహారాలకు గాను చంద్రబాబు హయాంలో ఉద్యోగులకు ఉపశమనం కల్పిస్తూ ఉచిత వసతి, ఉచిత రవాణా ఏర్పాటు చేశారు. వసతి కోసం నాగార్జున యూనివర్సిటీ సమీపంలో ఏర్పాట్లు చేశారు. ఇక రవాణా కోసం ప్రత్యేకమైన ప్రభుత్వ బస్సులు, వెహికల్స్ అరేంజ్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఎంప్లాయిస్ రైలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అది కొనసాగుతోంది. అయితే అది తాత్కాలికమేనని బాబు సర్కారు స్పష్టంగా పేర్కొంది. అప్పటి నుంచి ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. ప్రభుత్వం మారి జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్ల కాలంలో కూడా ప్రభుత్వమే వారికి ఉచిత వసతి కొనసాగించింది.

ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ ఫస్టు నుంచి ఉద్యోగులు, ఉద్యోగినులు ఎవరి వసతి వారే సొంత ఖర్చులతో భరించాలని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇటీవల గత ఆగస్టు నుంచి వచ్చే అక్టోబరు 31 తేదీ వరకు మాత్రమే ఉచిత ట్రాన్సిట్ వసతిని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 31 తరువాత ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత సదుపాయాలు నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఉద్యోగులకు ముందస్తు సమాచారాన్ని జారీ చేసింది. వీరిలో సచివాలయం, శాసన పరిషత్, హెచ్ఓడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న పురుష, మహిళా ఉద్యోగులకు ఇప్పటివరకూ షేరింగ్ ప్రాతిపదికన ఉచిత వసతి కల్పించిన ప్రభుత్వం ఇక నుంచి వారికే ఆ బాధ్యతలు అప్పగించింది. 2021 నవంబరు 1 నుంచి ఉద్యోగులెవరికీ ఉచిత వసతి వెసులుబాటు ఉండబోదని స్పష్టం చేసింది. అంటే ఇకపై ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎవరి వసతి ఏర్పాట్లు వారే చేసుకోవాలన్నమాట. 

కొద్ది రోజుల క్రితం మూడు రాజధానుల నిర్ణయంలో భాగంగా సచివాలయంతో పాటుగా ప్రధాన కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులు విశాఖ తరలి వెళ్లాల్సి ఉంటుందని ప్రచారం సాగింది. అయితే, న్యాయపరంగా ఆ నిర్ణయం ఇంకా అమలు కాలేదు. ఇదే సమయంలో ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి దాదాపు అయిదేళ్ల పాటు ఉచిత వసతి కల్పించా మని, ఇక ఉద్యోగులే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పినట్లుగా అత్యంత విశ్వసనీయ సమాచారం. అయితే తమకు కల్పించిన ఉచిత వసతి, ఉచిత రవాణా అనేవి కొద్దికాలంపాటే ఉంటాయని తమకు తెలుసని, అయినప్పటికీ రాజధాని లాంటి కీలక అంశాల్లో కోర్టు నుంచి ఇంకా ఎలాంటి నిర్ణయం కూడా రాలేదు కాబట్టి.. తీర్పు వెలువేడాదాకానైనా ప్రభుత్వం ఈ తాత్కాలిక వసతిని కొనసాగిస్తే బాగుంటుందని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. ఎందుకంటే రాజధాని ఎక్కడ ఉంటుందో పూర్తి నిర్ణయం బయటపడ్డాక తాము కుటుంబాలు సహా ఆయా పట్టణాల్లో పని చేయడానికి సంసిద్ధంగా ఉంటామని, కానీ ఇప్పుడు ఆఫ్ బ్యాచులర్స్ గా ఉంటున్న తమకు కనీస వసతి, రవాణా కూడా కల్పించకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తమకు సౌకర్యంగా ఉండడాన్ని పక్కనపెడితే విధి నిర్వహణ సాఫీగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని వారంటున్నారు. దీంతో..ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు, నేతలు ఏవిధంగా రియాక్ట్ అవుతారన్నదే ఆసక్తికరంగా మారింది.

Related Segment News