దాగుడుమూత దండాకోర్ సినిమా చూపిస్తున్న జగన్ సర్కార్!

ఇకపై ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖలూ తమ తమ ఉత్తర్వులను ఏపీ గెజిట్ వైబ్ సైట్ లో అప్లోడ్ చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఉత్తర్వులను అప్ లోడ్  చేయకపోవడంపై సాధారణ పరిపాలనా శాఖ (జిఏడీ) అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వెల్లడించిన ప్రభుత్వం ఇకపై అన్ని జీవోలు క్రమం తప్పకుండా గెజిట్ వెబ్ సైట్లో పొందుపరచాలని పేర్కొంది. కొన్ని ప్రభుత్వ విభాగాలు జీవోలు అప్ లోడ్ చేయకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన జీఏడీ.. ఇకపై అన్ని జీవోలు అప్లోడ్ చేయాలని పేర్కొంది. దాంతోపాటు జీవోఎంఎస్, జీవోఆర్టీలను నిరంతరం అప్ లోడ్ చేయాలని జీఏడీ నోట్ విడుదల చేసింది. 2022 ఫిబ్రవరి 1 నుంచి నేటి వరకు జారీచేసిన జీవోలను వెంటనే సైట్ లో పెట్టాలని ఆదేశించింది. జీవోలు అప్ లోడ్  చేయడమే కాకుండా, వాటి వివరాలు కేబినెట్ సెక్షన్ అధికారికి పంపాలని వివరించింది. జీవోలు అప్ లోడ్  చేయకపోతే.. ఇన్ చార్జీలను బాధ్యులను చేస్తామని హెచ్చరించింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసే పలు జీవోలు పబ్లిక్ కి తెలియడం లేదని, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని హైకోర్టు తప్పు పట్టిన నేపథ్యంలో హడావిడిగా వివిధ శాఖలకు జీఏడీ ఈ నోట్ విడుదల చేసింది.

అయితే  జీవోలపై ప్రభుత్వం ఇలాంటి హెచ్చరికలు చేయడం ఇదే మొదటి సారి కాదు. కోర్టులలో ఈ కేసు విచారణకు వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వం ఇదే తరహా హెచ్చరికలు చేస్తూ వస్తోంది. కానీ  ఆచరణ మాత్రం సూన్యం.  గతంలొ 2021 సెప్టెంబర్ 7న ఒకసారి ఇలాగే అన్ని ప్రభుత్వ శాఖలను హెచ్చరిస్తూ ఆదేశాలిచ్చారు. అన్ని శాఖలు తమ పరిధిలోని అన్ని జీవోలు ఏపీ గెజిట్ వైబ్ సైట్ లో పొందు పరచాలని ఆదేశించారు. కానీ చాలా జీవోలు ప్రజలకు కనిపించడం లేదు. ఆ తర్వాత 2022లోనూ సాధారణ పరిపాలన శాఖ ఇదే ఆదేశాలు ఇచ్చింది. కానీ  జీవోలు మాత్రం ఏపీ గెజిట్ వెబ్ సైట్లో కనిపించలేదు.   ఈ ఏడాది మే నెలలోలో కూడా జీవోల అప్ లోడింగ్ పై ప్రభుత్వ శాఖలకు మరోసారి ఆదేశాలు జారీ  అయ్యాయి. అయినా ఇప్పటికీ పరిస్ధితిలో మార్పు లేదు.  జీవోలు అప్ లోడ్ చేయకపోవటాన్ని ఇటీవలే హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి హడావిడిగా వివిధ శాఖలకు జీఏడీ అన్ని జీవోలు అప్ లోడ్ చేయాలని ఆదేశిస్తూ  నోట్ విడుదల చేసింది. దీంతో ఇప్పుడు ఈ ఆదేశాలు కూడా ఉతుత్తి ఆదేశాలేనా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

ప్రభుత్వం ప్రతీ రోజూ పలు అంశాలపై వివిధ నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయాలను జీవోల రూపంలో  విడుదల చేస్తుంది. ఈ జీవోల ఆధారంగానే సంబంధిత వ్యక్తులు, సంస్ధలు, అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు. వీటిని గతంలో జీవోఐఆర్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసే వారు. కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2021లో పలు మార్పులు చేసి ఏపీ గెజిట్ పేరుతో కొత్త వెబ్ సైట్  తీసుకువచ్చింది. సైట్ పేరు అయితే మారింది కానీ  జీవోలు మాత్రం అప్ లోడ్ కావడం లేదు. దీనిపై చాలా కాలంగా ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నాలుగున్నరేళ్ల జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ అంశంపై ఇప్పటికే పదిసార్లు ఫిర్యాదులు, పదుల సంఖ్యలో ఆదేశాలు ఇచ్చారంటే ఇది ఏ స్థాయిలో  వివాదాస్పదం అయ్యిందో అర్ధం అవుతుంది. ప్రభుత్వం ఎన్నిసార్లు ఆదేశాలిచ్చినా పూర్తిస్థాయిలో జీవోలు అప్ లోడ్ కావడం లేదు. వాస్తవానికి ప్రభుత్వమే మా ఆదేశాలు ఉత్తుత్తివే.. జీవోలు అప్ లోడ్ ప్రశక్తేలేదన్న విధంగా వ్యవహరిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   చాలాసార్లు రహస్య జీవోలు తెచ్చి ఆయా శాఖలకు ఆదేశాలివ్వడం, ఆ శాఖ గుట్టుచప్పుడు కాకుండా అమలు చేయడం జరిగిపోతుంది. అలాంటి రహస్య జీవోలకు కూడా నంబరు ఉంటుంది కానీ  అందులో కంటెంట్‌ మాత్రం కనపడదు.   ఈ ప్రభుత్వంలో  జీవోలు ఏవీ కూడా వెబ్ సైట్ లో అందుబాటులో ఉండడం లేదు.

దీంతో ఇప్పుడు జీవోలన్నీ విడుదల చేయమంటూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కూడా ఉత్తుత్తివేనన్న అభిప్రాయమే సర్వత్రా వినవస్తోంది.  జగన్ ప్రభుత్వం తీసుకొనే పలు నిర్ణయాలపై మీడియాలో చర్చ జరగడం, సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవడం, కోర్టుల్లో వ్యతిరేక తీర్పులు రావడం తెలిసిందే. దీంతో ఈ జీవోల రూపంలో ప్రజలు వాస్తవాలు తెలుసుకోవడం అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది. దీంతో ఏపీ గెజిట్ లో జీవోలను అప్ లోడ్  చేయడం మానేశారు. ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకోవడం.. ఆయా శాఖలు ఆ ఆదేశాలను అమలు చేయడం జరిగిపోతున్నది. కానీ ప్రజలకే అసలు విషయం తెలియడం లేదు. ప్రభుత్వానికి పారదర్శకత చాలా అవసరం. కానీ  జగన్ సర్కార్ లో అదే లోపించింది. దీంతో హైకోర్టు ఆగ్రహించి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించింది. ఆ వెంటనే ప్రభుత్వం అన్ని శాఖలకు మరోసారి ఆదేశాలిచ్చింది. కానీ, ఈ ఆదేశాలు అమలవుతాయా అంటే  మాత్రం అనుమానమే అన్న సమాధానమే వస్తోంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu