ఏ బిడ్డా ఇది నా అడ్డా అనగలవా జగన్?.. పులివెందుల నడిబొడ్డున బాబు సవాల్
posted on Aug 5, 2023 10:19AM
పులివెందుల.. ఈ పేరు చెబితే చాలు ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న ఎవరైనా వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అని ఠక్కున చెప్పేస్తారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ నియోజకవర్గం ప్రజల అండదండలతో రాష్ట్ర రాజకీయాలను శాసించారు. వైఎస్ కుటుంబం ఏం చెబితే అక్కడి మెజార్టీ ప్రజలు అదే ఫాలోఅయ్యేవారు. వైఎస్ఆర్ మృతి తరువాత కూడా వై.ఎస్. జగన్‌కు పులివెందుల ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపించి సీఎంను చేశారు. వైఎస్ఆర్ బంతికున్న సమయంలో పులివెందులలో ప్రతిపక్షపార్టీల నేతలు అడుగుపెట్టి గర్జిద్దామన్నా అక్కడి ప్రజల నుంచి స్పందన కరవయ్యేది. దీంతో కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు ఎలాగో.. పులివెందుల ప్రజలు వైఎస్ఆర్ కుటుంబానికి అలా అండగా నిలుస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం పులివెందులలో పరిస్థితులు మారుతున్నాయి. ఇందుకు నిదర్శనం తెలుగుదేశం అధినేత చంద్రబాబు పులివెందుల వెళ్లి సింహగర్జన చేయడమే. వైసీపీ శ్రేణుల్లో ఇన్నాళ్లూ ఒక గట్టి నమ్మకం ఉండేది. చంద్రబాబు రాష్ట్రంలో ఎక్కడికివెళ్లినా ప్రజల నుంచి స్పందన వస్తుందేమో కానీ.. జగన్ మోహన్‌రెడ్డి అడ్డా పులివెందుల వెళితే పరాభవం తప్పదనే భావనలో ఉండేవారు. అయితే, రెండు రోజుల క్రితం చంద్రబాబుకు పులివెందుల ప్రజలు బ్రహ్మరథం పట్టడంతో వైసీపీ శ్రేణుల నమ్మకం పటాపంచలైపోయింది. వారి వెన్నులో వణుకు పుట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చంద్రబాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిల రాజకీయాలు వేరుగా ఉండేవి. చంద్రబాబుకు కుప్పం నియోజకవర్గం కంచుకోటగా ఉండగా.. రాజశేఖరరెడ్డికి పులివెందుల కంచుకోటగా ఉంది. వీరిద్దరూ ప్రత్యర్థులైనప్పటికీ ఒకరి నియోజకవర్గంలో మరొకరు ఆధిపత్యం చెలాయించాలని ఎప్పుడూ చూడలేదు. ప్రస్తుతం సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో వైసీపీ జెండా ఎగురేస్తామంటూ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. దీనికి తోడు కుప్పంలో చంద్రబాబు పర్యటించిన సమయంలో అనేక అడ్డంకులు సైతం సృష్టించారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కుప్పంలో చంద్రబాబు ఓడిపోవటం అలా ఉంచితే.. పులివెందులలో జగన్ పరువు పోయే పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు అంటున్నారు.
జగన్ వ్యూహం రివర్స్ అయ్యిందని విశ్లేషిస్తున్నారు. చంద్రబాబు పులివెందుల నియోజకవర్గంలో కాలుమోపడమే తరువాయి అక్కడి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీనికితోడు చంద్రబాబు పర్యటనను అడ్డుకోవాలని చూసిన వైసీపీ శ్రేణులను తరిమి కొట్టారు. ఈ విచిత్ర పరిస్థితి చూసి ఇది పులివెందుల నియోజకవర్గమేనా అనే అనుమానం విశ్లేషకుల నుంచిసైతం వ్యక్తమవుతోంది. చంద్రబాబుకు పూలుపరిచి పులివెందుల ప్రజలు స్వాగతం పలకడంతో పాటు, చంద్రబాబు మాట్లాడే ప్రతీ మాటకు హర్షధ్వానాలు చేశారు. దీంతో పులివెందుల ప్రజలు చంద్రబాబుకు పలికిన స్వాగతాన్ని చూసి వైసీపీ శ్రేణులు వణికిపోతున్నాయని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.
జగన్ మోహన్ రెడ్డిపై పులివెందుల ప్రజల్లో రోజురోజుకు ఆదరణ తగ్గిపోవడానికి పలు కారణాలను విశ్లేషకులు తెరపైకి తెస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్షంలో, సీఎంగా ఉన్న సమయంలోనూ పులివెందులకు ఎప్పుడో ఒకసారి వచ్చేవారు. అక్కడ రాజకీయాలన్నీ ఆయన సోదరుడు వివేకానందరెడ్డి చూసుకుంటూ ఉండేవారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా వివేకానందరెడ్డే పరిష్కరించేవారు. ఏదైనా పెద్ద సమస్య అయితేనే వైఎస్ఆర్ వరకు వచ్చేది. దీనికి తోడు పులివెందుల నుంచి తనను కలిసేందుకు వచ్చినవారికి రాజశేఖరరెడ్డి సమయం కేటాయించి వారి సమస్యలను వినేవారు.
వారి సమస్యలను వెంటనే పరిష్కరించేలా చూసేవారు. దీంతో పులివెందుల ప్రజలకు వైఎస్ఆర్ అన్నా.. వివేకానంద రెడ్డి అన్నా ఎనలేని అభిమానం. వైఎస్ఆర్ మరణం తరువాత జగన్మోహన్‌రెడ్డిపై సైతం పులివెందుల ప్రజలు అంతే అభిమానాన్ని చూపుతూ వచ్చారు. అయితే, ఈ నాలుగేళ్ల కాలంలోజగన్ తమను పట్టించుకోలేదన్న భావన అక్కడ ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. దీనికితోడు పులివెందుల ప్రజలకు జగన్ దర్శనభాగ్యమే కరువవుతోందట. ఒకవేళ జగన్‌ను కలిసేందుకు వెళ్లినా అవకాశం దక్కడం లేదట. దీంతో రోజురోజుకు జగన్ అంటే అక్కడి ప్రజలు చీదరించుకొనే పరిస్థితులు ఏర్పడినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతుంది.
చంద్రబాబుకు పులివెందులలో అద్భుత ఆదరణ లభించడానికి మరోకారణం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అదే.. వివేకానందరెడ్డి హత్య. వివేకా హత్యకేసు విచారణలో సీఎం జగన్ తీరు పులివెందుల ప్రజలకు ఆగ్రహాన్ని కలిగిస్తోందని చెబుతున్నారు. వివేకాను అవినాశ్ రెడ్డి హత్యచేశాడని రాష్ట్రం మొత్తం కోడైకూస్తున్నా జగన్ మాత్రం ఆయన్ను కాపాడుకుంటూ వస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీనికితోడు వివేకా కుమార్తెను దూరం పెట్టడం, సొంత చెల్లి షర్మిలను దూరం పెట్టడం కూడా పులివెందుల ప్రజల్లో జగన్ పట్ల వ్యతిరేక భావం నెలకొనడానికి కారణమని పరిశీలకులు చెబుతున్నారు. సీఎంగా ఉండి, కేంద్ర ప్రభుత్వం అండదండలు పుష్కలంగా ఉన్నప్పటికీ జగన్ మోహన్‌రెడ్డి సొంత బాబుయిని హత్య చేసిన నిందితులను కటకటాల్లోకి పంపించలేక పోయాడని, ఇక మనకేం న్యాయం చేస్తాడనే భావనకు పులివెందులలోని మెజార్టీ ప్రజలు వచ్చారంటున్నారు. ఇదే పరిస్థితి ఎన్నికల వరకు కొనసాగితే.. వచ్చే ఎన్నికల్లో పులివెందులలో టీడీపీ జెండా ఎగిరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు.