రేపో మాపో జగన్ కేబినెట్ విస్తరణ? కొడాలి, బాలినేనిలకు మళ్లీ చాన్స్?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముచ్చటగా మూడోసారి తన  కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమయ్యారా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారైందని అందుకే ఇటీవల గవర్నర్  అబ్దుల్ నజీర్‌తో భేటీ అయ్యారనీ, ఆ భేటీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించే ఆయనతో చర్చించారనీ అంటున్నారు.  రేపో మాపో..ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మార్చి 31 లేదా ఏప్రిల్ మొదటి వారంలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని చెబుతున్నారు.  ఈ సారి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ముగ్గురు నుంచి ఐదుగురి వరకూ కొత్త వారికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు.  కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితోపాటు ఉత్తరాంధ్ర, పశ్చిమ, తూర్పు రాయలసీమ ప్రాంతాల నుంచి ఇద్దరిని తీసుకునే అవకాశం ఉందనే   చర్చ పార్టీ వర్గాలలో జోరుగా కొనసాగుతోంది.

అలాగే ఇద్దరు ముగ్గురు ప్రస్తుత మంత్రులకు ఉద్వాసన కూడా ఉంటుందని అంటున్నారు.  కొడాలి నానికి మరోసారి మంత్రిగా అవకాశం ఇవ్వాలని సీఎం డిసైడైపోయారని చెబుతున్నారు.  ముఖ్యమంత్రి వైయస్ జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే.  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విపక్షాలపై ఘాటు విమర్శలు చేయాలంటే కొడాలి వంటి మంత్రి తన కేబినెట్ లో ఉండాలని జగన్ భావిస్తున్నారని చెబుతున్నారు.  అదీకాక   జగన్ రెండోసారి... తన కేబినెట్ కూర్పులో.. కొడాలి నాని సామాజిక వర్గానికి చెందిన వారిని తీసుకోదు. ఇదే అంశాన్ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తండ్రి వసంత నాగేశ్వరరావు బహిరంగంగానే సీఎం జగన్‌పై విమర్శలు సైతం గుప్పించిన సంగతి తెలిసిందే. అలాంటి వేళ కొడాలి నానినీ మళ్లీ కేబినెట్‌లోకి తీసుకుంటే.. అన్ని నొప్పులకు ఒకటే పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ లాగా... అందరికీ.. అన్నిటికి ఒకటే సమాధానం అవుతుందని సీఎం జగన్ భావిస్తున్నారన్న టాక్ అయితే పార్టీలో గట్టిగా వినిపిస్తోంది.   

ఇక ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి.. జగన్ తొలి కెబినెట్‌లో మంత్రిగా పని చేశారు. అదీకాక ముఖ్యమంత్రి జగన్‌కు సమీప బంధువు. కానీ రెండో సారి కేబినెట్ కూర్పులో క్యాస్ట్ ఈక్వేషన్ కారణంగా.. ఆయనను తప్పించడంతో.. బాలినేని శ్రీనివాసరెడ్డి అలా ఇలా కాదు.. ఓ రేంజ్‌లో హర్ట్ అయి బుంగ మూతి  పెట్టుకొన్నారు. బహిరంగంగా నిరసన కూడా వ్యక్తం చేశారు.  నెల్లూరు, తిరుపతి,   కడప జిల్లాలకు పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్‌గా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తున్నారు. 

అయితే ఉమ్మడి నెల్లూరు జల్లాలోని ఫ్యాన్ పార్టీలో అసంతృప్తి జ్వాలలు మిన్నంటాయి. ఆ క్రమంలో ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థి విజయం నేపథ్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డిలపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. 

అలాగే ఇదే జిల్లాకు చెందిన కొవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితోపాటు మరి కొందరు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేస్తారంటూ  సామాజిక మాధ్యమంలో ఓ రేంజ్ లో కథనాలు అయితే వెలువడుతున్న నేపథ్యంలో  నెల్లూరు జిల్లాలో  పార్టీలో ఉన్న అసమ్మతిని తగ్గించి.. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో మళ్లీ పార్టీ క్లీన్ స్వీప్ చేయించేందుకు బాలినేనితోపాటు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని కేబినెట్‌లోకి తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.  

ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు సీట్లు.. గంపగుత్తగా టీడీపీ ఖాతాలోకి వెళ్లిపోయాయి. దీంతో అటు ఉత్తరాంద్ర, ఇటు తూర్పు పశ్చిమ రాయలసీమ ప్రాంతాల నుంచి ఇద్దరిని కేబినెట్‌లో తీసుకొంటారని.. ఆ క్రమంలోనే ఆయా ప్రాంతాలకు చెందిన ప్రస్తుత కేబినెట్‌లోని మంత్రులకు ఉద్వాసన తప్పదన్న చర్చ జోరుగా సాగుతోంది.  మార్చి 14న జరిగిన కేబినెట్ భేటీలో.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో మన పార్టీ అభ్యర్థులే గెలవాలని.. మంత్రుల పని తీరును గమనిస్తున్నానని.. ఈ ఎన్నికల్లో తేడా వస్తే.. కేబినెట్‌లో మార్పులు చేర్పులు తథ్యమంటూ   ముఖ్యమంత్రి  జగన్ హెచ్చరించిన విషయాన్ని పార్టీ శ్రేణులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.