తప్పిన జగన్ అటెండెన్స్ లెక్కలు
posted on Feb 24, 2025 5:07PM

వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కే అవకాశం లేకపోవడంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని జగన్ ఫిక్స్ అయిపోయారు. ఆరు నెలలు సభకు గైర్హాజరైతే అనర్హత వేటు పడుతుంది కాబట్టి తన 11 మంది టీమ్‌లో అసెంబ్లీకి వచ్చిన ఆయన 11 నిముషాలు కూడా గడపకుండానే వెళ్లిపోయారు . అనర్హత వేటు భయంతో కేవలం అటెండెన్స్ కోసమే జగన్ టీమ్ సభకు వచ్చి వెళ్లారు. మరో ఆరు నెలల తర్వాత ఆయన మరోసారి అసెంబ్లీలో తళుక్కుమనే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానంటూ లాజిక్కు లేని రీజన్‌తో సభకు డుమ్మా కొడుతున్న జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేది తామేనని ఘనంగా ప్రకటనలు మాత్రం చేస్తున్నారు. అంతే కాదు తాను ఇంకా 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో ఉంటానని చెప్తున్న జగన్.. ఈ సారి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని 30 ఏళ్లు పరిపాలిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే అటెండెన్స్ విషయంలో జగన్ లెక్క తప్పినట్లు కనిపిస్తుంది. బడ్జెట్ సమావేశాల తొలి రోజున గవర్నర్ ప్రసంగం మాత్రమే ఉంటుంది. ఆ రోజుని అసెంబ్లీ జరిగినట్లు పరిగణలోకి తీసుకోరు. ఆ రోజు సభకు హాజరైనా అటెండెన్స్ పడదు. అంటే జగన్ సభకు హాజరవ్వనట్లే లెక్క. ఇటు చూస్తే జగన్ తన ఎమ్మెల్యేలకు హోదా లేకుంటే సభకు వెళ్లినా ఉపయోగమేముంటుందని చెప్పి పులివెందుల టూర్ పెట్టుకున్నారు.
ఈ సెషన్స్‌లో సభలో జగన్ హాజరు అధికారికంగా నమోదు కాకపోతే స్పీకర్ అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. మరి అయిదేళ్లు సీఎంగా ఉన్న జగన్ సభా నియమాలు తెలుసుకోకుండా సభలో హడావుడి చేసి.. హాజరు పడిందన్న ఫీలింగుతో వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు ఆయన ఈ సెషన్స్‌లోనే అసెంబ్లీలో మరోసారి కనపడకపోతే ఇక అసెంబ్లీకి రావాల్సిన అవసరమే లేకుండా పోతుంది. మొత్తానికి జగన్ తన బెట్టు వీడి మరోసారి మెట్టు దిగక తప్పేలా లేదిప్పుడు.