జగన్ వచ్చారు.. వెళ్లారు!.. అటెండెన్స్ పడిపోయింది.. పనైపోయింది!

జగన్ అసెంబ్లీకి హాజరయ్యారు. తనతో పాటు తన పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలనూ వెంటపెట్టుకుని మరీ అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలోకి నాలుగో గేటులోంచి కారులో రావడం నుంచి లోపలకు వచ్చిన తరువాత  నినాదాల వరకూ అంతా ఆ పార్టీ ముందుగానే నిర్ణయించుకు వచ్చిన డ్రామాగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. కేవలం అనర్హతా వేటు నుంచి తప్పించుకోవడానికే జగన్, ఆయన పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరౌతున్నారన్న పరిశీలకుల విశ్లేషణలు, తెలుగుదేశం, జనసేన నేతలు, క్యాడర్ విమర్శలను అక్షరసత్యాలు అన్న విషయాన్ని రుజువు చేసే విధంగానే జగన్ ఆయన పార్టీ ఎమ్మెల్యేల తీరు ఉంది. వైసీపీకి అసెంబ్లీలో కేవలం 11 మంది సభ్యులు ఉన్నారు. 

సోమవారం సభకు హాజరైన వైసీపీ సభ్యులు సరిగ్గా 11 నిముషాలు మాత్రమే సభలో ఉన్నారు. ఉన్న ఆ కొద్ది సమయం కూడా తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అంటూ నినాదాలు చేస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే వారి ఆందోళనను, నినాదాలను సభలో కూటమి సభ్యలు ఎవరూ పట్టించుకోలేదు. సభా నాయకుడు చంద్రబాబు కూడా వారి చిరునవ్వులు చిందిస్తూ.. ఈ డ్రామాలన్నీ మాకు అర్ధమౌతున్నాయన్నట్లు కూర్చున్నారు. దీంతో చేసేదేం లేక జగన్ తన సభ్యులతో సహా అసెంబ్లీని బాయ్ కాట్ చేసి గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి వాకౌట్ చేశారు.

జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరౌతున్నట్లు ఆ పార్టీ ప్రకటించిన మరుక్షణం నుంచీ, సర్వత్రా జగన్ హాజరు కేవలం తన శాసనసభా సభ్యత్వాన్ని కాపాడుకోవడానేనన్న భావన వ్యక్తమైంది. జగన్ తరహా అంతా అందితే జుట్టు, అందకుంటే కాళ్లు అన్న తరహాలోనే ఉంటుందంటూ రాజకీయవర్గాలలో గట్టిగా వినిపించింది. ఒక రోజు భాగ్యానికే తప్ప జగన్ అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనే అవకాశాలు లేవన్న విశ్లేషణలు వినిపించాయి. వాటికి అనుగుణంగానే అనర్హతా వేటు నుంచి తప్పించుకోవడం కోసమే వైసీపీ సభ్యలు సోమవారం (ఫిబ్రవరి 24) అసెంబ్లీకి వచ్చినట్లే వచ్చి వాకౌట్ చేశారు. మళ్లీ అరవై రోజుల వరకూ వారు అసెంబ్లీ వైపు కన్నెత్తి కూడా చూసే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. అనర్హతా వేటు పడి.. ఉప ఎన్నికలు వస్తే ప్రస్తుతం ఉన్న 11 స్థానాలూ కూడా కోల్పోతామన్న భయంతోనే జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని సభకు వచ్చారని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu