జగన్, అవినాష్ ఆధ్వర్యంలోనే వివేకా హత్య!
posted on Aug 9, 2025 11:16AM
.webp)
ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆరేళ్లుగా సా..గుతూనే ఉన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇన్నేళ్లుగా రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగానే ఉంది. ఈ కేసు విషయంలో సీబీఐ తీరు కూడా పదేపదే ప్రశ్నార్థకంగానే ఉంటూ వస్తున్నది. తాజాగా సుప్రీం కోర్టులో ఈ కేసు దర్యాప్తు పూర్తయ్యిందంటూ నివేదిక సమర్పించడంపై కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీం ఆదేశిస్తే అదనపు దర్యాప్తు చేస్తామనడంపైనా అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ఈ కేసులో నిందితులకు ముందస్తు బెయిలు మంజూరు కావడానికి, అలాగే మంజూరైన బెయిలు రద్దు కాకుండా ఉండేందుకే సీబీఐ దర్యాప్తు పూర్తయ్యిందని చెబుతోందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలోనే జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. వివేకా జయంతి సందర్భంగా పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లిన ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని కోరుతూ.. గతంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు తాను నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ వివేకాతో తనకు రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. హత్య అన్న ఆలోచనే ఎన్నడూ చేయలేదన్నారు.
వివేకా హత్య జరిగిన రోజున మీడియాను అనుమతించకుండా అడ్డుకున్నారనీ, గొడ్డలిపోటు అని స్పష్టంగా కనిపిస్తున్నా గుండెపోటు అంటూ ప్రకటనలు గుప్పించడంతోనే వివేకా హత్య కుట్రపూరితంగా జరిగిందని స్పష్టమౌతోందని ఆదినారాయణ రెడ్డి అన్నారు. కాగా కోడి కత్తి ఘటన, గులకరాయి దాడి సంఘటనా కూడా నాటకాలేనని అన్నారు. జగన్ కంటి దగ్గర గులక రాయి తగలడం కూడా మరో నాట కం అని విమర్శించారు.
వివేకా హత్య సమయంలో తనపై వచ్చిన ఆరోపణలు అసత్యమని తాను మొదటి నుంచీ చెబుతున్నాన్న ఆదినారాయణ రెడ్డి... వివేకా కూతురు సునీతా రెడ్డి ఇప్పుడు వాస్తవాలు తెలుసు కున్నారన్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారానికి సునీత వస్తే తనకు అభ్యంతరం లేదని ఆదినారాయణ రెడ్డి అన్నారు.