రాజకీయాలలో విజయ్ సినిమా ఫ్లాపేనా?.. తాజా సర్వేలో టీవీకే పార్టీకి వచ్చే సీట్లెన్నంటే?

తమిళ తళపతి విజయ్ పొలిటికల్ మూవ్ పెద్ద డిసాస్టర్ గా మారనుందా? రాజకీయ పార్టీ స్థాపించి ఆయన సాధించేదేమీ లేదా? అంటే తాజాగా ఒక ప్రముఖ చానల్ నిర్వహించిన సర్వేలో అదే తేలింది. 2026 అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ పార్టీ టీవీకే అధికార డీఎంకే పార్టీకి గట్టి పోటీదారుగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి. అయితే తాజా సర్వేలో ఎన్నికలలో టీవీకే నామమాత్రపు ప్రభావాన్ని మాత్రమే చూపుతుందని తేలింది. వచ్చే ఎన్నికలలో అధికార డీఎంకే 105 స్థానాలతో సునాయాసంగా మెజారిటీ సాధించి మరో సారి అధికార పగ్గాలు చేపడుతుందని సర్వే పేర్కొంది. ఇక ఏఐడీఎంకే 90 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా నిలుస్తుందనీ సర్వే ఫలితం తేల్చింది.

అయితే ఎన్నో అంచనాలున్న విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం మాత్రం కనీసం ఒక్క స్థానంలో కూడా విజయం సాధించే అవకాశం లేదని సర్వే పేర్కొంది. తమిళనాడులోని 234  అసెంబ్లీ స్థానాలలో టీవీకే ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించే అవకాశం లేదని సర్వే పేర్కొనడంతో విజయ్ ను తమిళ జనం ఇప్పటికీ విజయ్ ను మాస్ హీరోగానే తప్ప   రాజకీయనాయకుడిగా గుర్తించడం లేదని అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలో టీవీకే అధినేత విజయ్.. హీరో ఇమేజ్ నుంచి పొలిటికల్ లీడర్ గా తన ఇమేజ్ ను మేకోవర్ చేసుకోవడానికి ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారన్నది ఆసక్తిగా మారింది.