పీవీ రమేష్ అరెస్టుకు ఏపీ పోలీసుల ప్రయత్నం! 

ఆంధ్రప్రదేశ్ లో జగన్   ప్రభుత్వానికి సలహాదారుగా పని చేసిన మాజీ ఐఏఎస్ అధికారిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు విఫలయత్నం చేశారని తెలుస్తోంది., హైదరాబాద్‌లోని ఆయన ఇంటి వద్దకు దాదాపుగా ఇరవై మంది వరకూ పోలీసులు వచ్చారట. కానీ ఆయన ఇంట్లో లేకపోవడంతో అరెస్ట్ చేయలేకపోయారని చెబుతున్నారు. ఏపీ పోలీసులు  రావడంతో పీవీ రమేష్  కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారని అంటున్నారు. పీవీ రమేష్ ను ఏపీ పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారో తమకు తెలియడం లేదని చెబుతున్నారు. 

పీవీ రమేష్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహిత ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు నిమ్స్ బాధ్యతలు సహా అత్యంత కీలకమైన పదవుల్లో ఆయన పని చేశారు . తర్వాత ఆయన కేంద్ర సర్వీసులకు వెళ్లారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రత్యేకంగా రాష్ట్ర సర్వీసుకు తీసుకు వచ్చారు. కీలక బాధ్యతలు ఇచ్చారు. రిటైరైన వెంటనే ఆయనను సలహాదారుగా నియమించారు జగన్ రెడ్డి. మధ్యలో ఏం జరిగిందో కానీ ఆయనను అవమానకరంగా బయటకు పంపేశారు. అప్పట్నుంచి పీవీ రమేష్ సైలెంట్‌గా ఉన్నారు.సోషల్ మీడియాలో కొన్ని ట్వీట్లు చేస్తూంటారు పీవీ రమేష్. అయితే నేరుగా ఎవర్నీ ఉద్దేశించి కూడా ఆయన వ్యాఖ్యలు చేయరు. ఆయన చేసిన కొన్ని ట్వీట్లు జగన్ సర్కార్ కు ఇబ్బందిగా మారాయి. 

పీవీ రమేష్ సోదరిని ప్రస్తుతం ఏపీ సీఐడీ చీఫ్‌గా ఉన్న సునీల్ కుమార్ వివాహం చేసుకున్నారు. అయితే ఆయనపై గృహ హింస కేసును ఆమె నమోదు చేసింది. ఆ వివాదం ఉంది. ఈ క్రమంలో పీవీ రమేష్ అరెస్టుకు ఏపీ పోలీసులు ప్రయత్నాలు చేయడం సంచలనంగా మారింది. అసలు ఆయనపై నమోదైన కేసేంటి..? చట్ట బద్దంగా నోటీసులు కూడా ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు..? లాంటి అంశాలపై స్పష్టత లేదు. పీవీ రమేష్ ఈ అంశంపై స్పందిస్తేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.  
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu