తగ్గేదే లే.. రెబెల్స్‌కు రోజా వార్నింగ్...
posted on Dec 20, 2021 4:39PM
ఎవరెన్ని కష్టాలు పెట్టినా.. నియోజకవర్గంలో అణగతొక్కాలని చూసినా.. అవమానాలు చేసినా.. జగనన్న మీద అభిమానంతో జగన్ అడుగుజాడల్లో ముందుకు వెళ్తున్నానంటూ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్లు చేశారో నగరిలో అందరికీ తెలుసు. ఎమ్మెల్యే రోజా వర్సెస్ మంత్రి పెద్దిరెడ్డి.. ఎమ్మెల్యే రోజా వర్సెస్ డిప్యూటీ సీఎం నారాయణస్వామిల వైరం రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. తాజాగా, మంగళవారం జగన్ బర్త్‌డే సందర్భంగా.. నగరి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య కుమ్మలాటలు మరోసారి బయటపడ్డాయి.
పుత్తూరులో వైసీపీకి చెందిన రెబల్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అది తట్టుకోలేని కొందరు.. ఆ ఫ్లెక్సీలను చించివేశారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు చించివేయడంతో కలకలం రేగింది. ఫ్లెక్సీలు డ్యామేజ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ రెబల్స్ డీఎస్సీ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.

అంతకుముందు.. నగరి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన కీలక నాయకులు సమావేశమై వచ్చే ఎన్నికల్లో రోజాను గెలిపించేది లేదని తీర్మానించారు. అసలు ఆమెకు ఎమ్మెల్యే టికెటే ఇవ్వొద్దని జగన్‌కు సూచించారు. ఇలా తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న నాయకులకు.. పెద్దిరెడ్డి, నారాయణ స్వామిల సపోర్ట్ ఉందనేది రోజా అనుమానం. అందుకే, ఎవరెన్ని కష్టాలు పెట్టినా.. తనను అణగదొక్కాలని చూసినా.. అవమానించినా.. జగనన్న అభిమానంతో తగ్గేదే లే అంటూ సవాల్ చేస్తున్నారు నగరి ఎమ్మెల్యే రోజారెడ్డి.