అగ్నిపధ్ అనాలోచిత నిర్ణయమేనా?

ఉక్రెయిన్ ఎంత దేశం ? పిట్టంత దేశం... మరి రష్యా, చాలా పెద్ద దేశం. ఏనుగంత దేశం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, రష్యా భూవిస్తీర్ణంతో పోలిస్తే ఉక్రెయిన్ కేవం 30 వంతు (మూడవ వంతు) భూభాగం ఉన్న చిన్న దేశం. ఒక్క విస్తీర్ణం పరంగానే కాదు, జనాభా, సైనిక, ఆర్థిక శక్తి సామర్ధ్యాలు ఇలా ఎలా చూసినా ఈ రెండు దేశాల మధ్య పొంతన పోలిక కుదరదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న యుద్ధం, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం  ప్రయోగించడంతో సమానం.అయినా, కొంత నష్ట పోయినా, అంతటి శక్తివంతమైన రష్యా నాలుగు నెలలుగా తమ దేశం పై సాగిస్తున్న దురాక్రమణ దాడులను ఉక్రెయిన్ నిరోధిస్తోంది.నిలువరిస్తోంది. సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. ఇది ఎలా సాధ్యం? రష్యా సైనిక దాడులను ఉక్రెయిన్ ఎలా నిరోధించ గలుగుతోంది?  పిచ్చుక  బ్రహ్మాస్త్రాని ఎలా తిప్పి కొడుతోంది?

కళ్ళ ముందు కనిప్సిస్తున్న ఈ ప్రత్యక్ష ఉదాహరణను గమనిస్తే, ఆధునిక యుద్ద తంత్రం,  యుద్ద సామర్ధ్యం నిర్వచనం మరిపోయిందనే వాస్తవం ఎవరికైనా, ఇట్టే అర్ధ మవుతుంది. ఆధునిక ఆయుధ సంపద లేని సైన్యం, నాడా లేని గుర్రం లాగా ఎందుకూ పని రాదని ఒక ఉక్రెయిన్, ఒక  వియత్నాం ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే సాయుధ బలగాల్లో నియామకాల కోసం, భారత ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ‘అగ్నిపధ్’, ‘అగ్ని వీర్’ పథకాన్ని చూడాలని నిపుణులు అంటున్నారు. అందుకే, ఈ పథకాన్నివ్యతిరేకిస్తున్న శక్తులు రాజకీయ అంధత్వంతో పథకాన్ని వ్యతిరేకిస్తున్నాయనే  నిపుణులు విశ్లేశిస్తునారు.  

నిజం, ఆధునిక యుద్ద తంత్రంలో సంఖ్యా బలం కాదు, సాంకేతిక బుద్ది  బలాలే కీలకం అనేది ప్రపంచ దేశాలు అన్నీ గుర్తిస్తున్నాయి. కేవలం నాలుగు కోట్ల జనభా ఉన్నా చిన్న దేశమే (ఇంచుమించుగా ఒక్క తెలంగాణ జనాభాకు సమానం) అయినా ఉక్రెయిన్,  డ్రోన్’లు ఇతర అత్యాధునిక సాంకేతిక ఆయుధాలాను సమకూర్చుకుంది, ఆధునిక యుద్ద తంత్రంతో ముందుకు సాగుతోంది. అందుకే రష్యా అంతటి  దేశం సాగిస్తున్న వైమానిక దాడుల నుంచి తమ  దేశాన్ని రక్షించుకోగలుగుతోంది.  ఒక్క ఉక్రెయిన్ అనే కాదు,

అమెరికా, చైనాల సైనిక శక్తి సామర్ధ్యాలను బేరీజు వేసుకున్నా  మనకు ఇదే వ్యత్యాసం కనిపిస్తుంది. అమెరికా సైన్యంతో పోలిస్తే చైనా సైన్యం చాలా పెద్దది. అయినా, అమెరికా సైనిక పాటవం ముందు చైనా దిగ తుడుపే. కారణం,ఆధినిక ఆయుధ సంపదలో అమెరికా ముందుంది, చైనా వెనక పడింది. నిజానికి అమెరికా అగ్రరాజ్య హోదాను నిలబెడుతోంది ఆ దేశ ఆర్థిక పుష్టి కాదు, ఆయుధ సామర్ధ్యమే.

ఇక మన దేశం (భారత దేశం) విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం రక్షణ రంగానికి మన దేశం రూ.5,25,166 కోట్లు ఖర్చు చేస్తోంది. అందులో రెవెన్యూ వ్యయం అంటే జీత భత్యాలు, మెయిన్టెనెన్స్ కోసం  రూ. 2,33,000 కోట్లు ఖర్చవుతున్నాయి, అంటే, మొత్తం బడ్జెట్ లో 44 శాతం. ఇక ఆధునిక ఆయుధాలు సమకూర్చుకోవడంతో పాటుగా, శిక్షణ, పరిశోధనలు   మొత్తం రూ.2,30,670 కోట్లు. ఈ రోజుల్లో యుధ్ధం అంటే సాంకేతికత, ఆయుధాలు ఉపయోగించడంలో నైపుణ్యం తప్ప ఎన్ని లక్షల మంది సైన్యం  ఉన్నారనేది కాదు. మరి సరికొత్త సాంకేతికత, ఆయుధాలు సమకూర్చుకోవాలంటే మిగిలిన ఖర్చు తగ్గించుకోవడం మినహా మరో మార్గం లేదు. 

ఒకప్పుడు అప్పటి రక్షణ మంత్రి ఏకే అంటోనీ ఫ్రాన్స్ నుంఛి రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు సొమ్ములు లేవని బహిరంగంగా పేర్కొన్నారు. నిధులు లేకనే ఒప్పందం ముందుకు సాగలేదని అంగీకరించారు.  కానీ, 2014లో ప్రభుత్వం మారిన తర్వాత 36 రాఫెల్ యుద్ద విమానాలను కొనుగోలు చేయడమే కాదు, 36 కు 36 యుద్ద విమానాలు మన దేశానికి చేరుకున్నాయి. చైనా సరుహద్దుల్లో యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. రాఫెల్ యుద్ధ విమానాల రాక‌తో  ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ కు మ‌రింత సామార్థ్యం పెరిగింద‌ని భావిస్తున్నారు అధికారులు.

నిజమే గత  రెండు సంవత్సరాలుగా కొవిడ్ కారణంగా రిక్రూట్మెంట్ లేక సైన్యం చేరేందుకు లక్షలాది మంది యువత ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితిలో, సాయుధ బలగాల్లో నియామకాల కోసం, కొత్తగా ‘అగ్నిపధ్’  పథకాన్ని  ప్రకటించడం కొంత ఆందోళన కలిగించే అంశమే. సైన్యంలో చేరేందుకు సిద్దమైన యువకుల ఆందోళనను ఎవరైనా అర్థం చేసుకోవచ్చును. కానీ, పథకం మంచి చెడులను చూడకుండా, యువతను రెచ్చగొట్టి అరాచకాన్ని సృష్టిస్తున్న శక్తులు ఏమి ఆశించి యువతను పెడదారి పట్టిస్తున్నాయి, ఇదే ఇప్పడు అందరూ ఆలోచించవలసిన విషయంగా నిపుణులు భావిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu