భయపెట్టడమేనా వైసీపీ బ్రాండ్?

 

ఆవిర్భావం నుంచీ భయపెట్టడమే తన బ్రాండ్  అన్నట్లుగా వైసీపీ తీరు ఉంది. అధికారంలో ఉన్నా, లేకపోయినా వైపీపీ జనాలను భయపెట్టి సాగుతోంది. 2014 ఎన్నికలలో ప్రతిపక్ష హోదా దక్కిన వైసీపీ అప్పుడూ జనాలను భయపెట్టే తీరుతోనే సాగింది. తాను చేసిన తప్పులకు కూడా అప్పటి అధికార పక్షంపై నెపం నెట్టి ప్రజలలో సానుభూతి సంపాదించుకుంది. ఆ తరువాత 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వైసీపీ సర్కార్ తీరు మారలేదు. అధికారంలో ఉండగా తీసుకున్న నిర్ణయాలు, వ్యవహరించిన తీరుతో వైసీపీ అంటేనే జనం వణికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి.

ఆ కారణంగానే 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని దారుణంగా ఓడించారు. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా వైసీపీకి అర్హత లేదని తీర్పు ఇచ్చారు. జగన్ పాలన వద్దు అన్న నిర్ణయానికి ప్రాంతాలకు అతీతంగా జనం అంతా ఏకాభిప్రాయానికి వచ్చారన్న విషయాన్ని ఆ ఎన్నికల ఫలితాలు నిర్ద్వంద్వంగా తేల్చేశాయి. జగన్ సొంత జిల్లా కడపలోనూ  వైసీపీ చావు దెబ్బ తింది. స్వయంగా జగన్ పోటీ చేసిన పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం లో కూడా ఆయన మెజారిటీ గణనీయంగా తగ్గింది. ఇక కడపలోని పది నియోజకవర్గాలలోనూ తెలుగుదేశం కూటమి ఏడు నియోజకవర్గాలలో విజయకేతనం ఎగుర వేసిందంటేనే జగన్ తన అడ్డాగా చెప్పుకునే జిల్లాలో జనం ఆయనను ఎంత వ్యతిరేకించారో అర్ధమౌతుంది. ఇక ఆ ఎన్నికలలో జగన్ పార్టీ కేవలం 11 అంటే 11 స్థానాలకు పరిమితమైంది.  అయినా కూడా వైసీపీ తీరు ఇసుమంతైనా మారలేదు. ఓడించిన జనంపైనే ఆ పార్టీ కక్ష గట్టిందా అన్నట్లుగా.. 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన ఏడాది తరువాత వెన్నుపోటు దినం నిర్వహించి జనం తనను వెన్నుపోటు పొడిచారంటూ చాటింది. అంతే కాకుండా మళ్లీ అధికారంలోకి వచ్చి రప్పరప్ప నరుకుతాం అంటూ హెచ్చరికలు జారీ చేసే విధంగా వ్యవహరిస్తున్నది. బెదరించి గెలిచేద్దాం అన్న మోడల్ లో ఇప్పటికీ ఫాలో అవుతోంది. 

ప్రజలలో మమేకం అవ్వడం కాదు.. వారిని బెదరించి, భయపెట్టి ఓట్లు వేయించుకోవాలన్న లక్ష్యంగా ముందుకు కదులులోందా అనిపించేలా ఆ పార్టీ కార్యక్రమాలు, జగన్, ఇతర వైసీపీ నేతల ప్రసంగాలు ఉంటున్నాయి.   పల్నాడు జిల్లా రెంటపాళ్ల జగన్ పర్యటన సందర్భంగా  ఆ పార్టీ క్యాడర్ ప్రదర్శించిన ఫ్లెక్సీలు  కూడా అదే చాటుతున్నాయి. అలాగే ఆ పర్యటనలో జగన్ ప్రయాణిస్తున్న వాహనం ఢీ కొని ఒక వ్యక్తి మరణించినా కూడా కనీసం వాహనం ఆపకుండా ముందుకు సాగిపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. దీంతో వైసీపీ అన్నా,  జగన్ పర్యటన అన్నా జనం భయంతో వణికిపోతున్న పరిస్థితులు ఉన్నాయి.  ఆ పార్టీ తీరు ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికలలో ఆ పార్టీకి  చట్టసభలో ప్రాతినిథ్యం  కూడా లేకుండా పోయే పరిస్థితి ఎదురైనా ఆశ్చర్యం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.