ఐపీఎల్ 2025 వాయిదా.. అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ
posted on May 9, 2025 4:02PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 వారం రోజుల పాటు వాయిదా పడింది. ఈ మేరకు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. పాకిస్థాన్ తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధవాతావరణం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. ఐపీఎల్ భాగస్వాముందరితో సమగ్రంగా చర్చించిన తరువాతనే ఈ నిర్ణయం తసుకున్నట్లు పేర్కొంది. శుక్రవారం ( మే9) నుంచి జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ లన్నిటినీ వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.
ప్రస్తుతానికి సస్పెన్షన్ ఒక వారం పాటు ఉంటుందని, తదుపరి అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామనీ బీసీసీఐ ఆ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే గురువారం ( మే 8 )న ధర్మశాలలో జరుగుతున్న మ్యాచ్ ను భద్రతా కారణాల దృష్ట్యా రద్దు చేసిన సంగతి తెలిసిందే. తదుపరి వివరాలు మరలా తెలియజేస్తామని బీసీసీఐ తెలిపింది.ఐపీఎల్ లో ఇంకా 12 మ్యాచ్ లు జరగాల్సి ఉంది. వీటిలో రెండు క్వాలిఫయిర్లు, ఒక ఎలిమిటేర్ ఉన్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25న కోల్ కతాలో ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో గుజరాత్, బెంగళూరు, పంజాబ్, మంబైలు టాప్ ఫోర్ లో ఉన్నాయి.