మేం ఇరాక్‌లోనే వుంటాం: కేరళ నర్సులు

 

 

 

ఇరాక్‌లోని టిక్రిట్ నగరంలోని ఓ ఆస్పత్రిలో 46 మంది భారతీయ నర్సులు వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ నగరాన్ని తీవ్రవాదులు తమ అదుపులోకి తీసుకున్నారు. దాంతో కేరళ రాష్ట్రానికి చెందిన భారతీయ నర్సులు అక్కడ చిక్కుకుపోయారు. అయితే ఆ నర్సులందరూ అక్కడ క్షేమంగా వున్నారని ఇరాక్‌లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఇండియాకి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వ సాయం ఏమైనా కావాలంటే ఆ మాటను లిఖితిపూర్వకంగా తెలియజేయాలని నర్సులకు భారత ప్రభుత్వం సూచించింది. అయితే కేరళ నర్సులు మాత్రం మేం ఇరాక్ వదిలి రామని అంటున్నారు. ఇరాక్‌లోనే వుండి ఇక్కడ గాయపడిన వారికి వైద్య సేవలు అందిస్తామని వారి సేవాభావాన్ని చాటారు. అయితే ఇరాక్‌లో తిరుగుబాటు చేసిన తీవ్రవాదులు నర్సుల విషయంలో చాలా మానవతతో వ్యవహరించారని సమాచారం అందుతోంది. ఇరాక్‌లో వున్న నర్సులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని వారికి తాము ఎలాంటి హానిని తలపెట్టబోమని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. వారంతా ఇరాక్‌లోనే వుండి గాయపడిన వారికి సేవలు చేయాలని సూచించారు. అవసరమైన పక్షంలో నర్సులకు తామే జీతాలు ఇస్తామని ప్రకటించారు.