నైరుతి ఆశలు ఆవిరి..!

వేసవి తాపంతో అల్లాడుతూ..వడగాల్పులు, ఉక్కపోతలతో వానెప్పుడు పడుతుంది రా బాబూ..!  అని ఎదురు చూస్తున్న ప్రజలకు చేదు వార్త. దేశంలోకి నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమయ్యే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ప్రతి ఏడాది జూన్ 1 నాటికి నైరుతి రుతుపవనాలు భారత భూభాగాన్ని తాకాలి. కాని రుతుపవనాల పురోగమనానికి దోహదపడే వాతావరణం హిందూ మహా సముద్రం పరిసరాల్లో నెలకొనాలి. నిజానికి మే నెలలో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి తరువాత బలపడి అండమాన్ నుంచి తూర్పు తీరం దిశగా రావాలి. అయితే ఈ ఏడాది ఆగ్నేయ బంగాళాఖాతంలో కాకుండా శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినందునే కేరళకు రుతుపవనాల రాక ఆలస్యమవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

 

నైరుతి రుతుపవనాల రాకకు సంబంధించి మోడల్ రూపకల్పనలో ప్రధానంగా నాలుగు అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. వాయువ్య భారతంలో కనీస ఉష్ణోగ్రతలు, ముందస్తుగా శ్రీలంకలో కురిసే వర్షాలు, దక్షిణ చైనా సముద్రంపై అవుట్ గోయింగ్ లాంగ్ వేవ్ రేడియేషన్ తదితర అంశాల ఆధారంగా రుతుపవనాల రాకను ఐఎండీ నిర్ధారిస్తుంది. ఈ అంశాలు ప్రతికూలంగా ఉండటంతో రుతుపవనాల రాక ఆలస్యమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.

 

తెలుగు రాష్ట్రాల సంగతి చూస్తే ఈ ఏడాది వర్షాలు సకాలంలోనే పలకరించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు జూన్ 7కు నాలుగు రోజులు ముందుగానీ, నాలుగు రోజుల తర్వాత గానీ కేరళను తాకే అవకాశలుండటంతో..కేరళను తాకిన తర్వాత పది రోజులకు తెలంగాణ, ఏపీల్లోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. గతేడాది రుతుపవనాలు జూన్ 5న కేరళను తాకగా..10న రాయలసీమలోకి ప్రవేశించాయని..13న తెలంగాణలోకి విస్తరించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. రుతుపవనాలు కేరళను తాకిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించడానికి ఒక్కోసారి 15-20 రోజులు పట్టే అవకాశాలున్నాయని కూడా నిపుణులు అంటున్నారు.

 

రుతుపవనాల రాక ఆలస్యం కానుందని వాతావరణ శాఖ చేసిన ప్రకటన ప్రజల్లో నిరాశ కలిగించింది. పుష్కలంగా వర్షాలు కురుస్తాయని చెప్పిన అధికారులు రుతుపవనాల రాక ఆరు రోజు లేటవుతుందని చెప్పడంతో రైతులు షాక్‌కు గురయ్యారు. భారతదేశ వ్యవసాయరంగం ప్రధానంగా రుతుపవన వ్యవసాయమనే చెప్పవచ్చు. రుతువుల ఆధారంగానే మనదేశంలో వ్యవసాయం జరుగుతుంది. వ్యవసాయం దేశ ఆర్ధిక వ్యవస్థకి వెన్నెముక . రుతుపవనాల్లో నమోదయ్యే అటుపోట్లు ఆర్థికరంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. అవి సకాలంలో వచ్చి సమృద్థిగా వర్షాలు కురిస్తే...అంతకన్నా దేశానికి కావల్సిందేమి లేదు. కానీ వాతావరణంలో మార్పుల ఫలితంగా రుతుపవనాలు సరైన సమయానికి రావడం లేదు. దీని వల్ల అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.

 

దేశంలో సుమారు మూడింట రెండొంతులు వర్షాధారిత వ్యవసాయమే. ఎలాంటి నిర్మాణానికైనా పునాది పటిష్టంగా ఉండాలంటారు. సంవత్సరంలో తొలి పంట పండే ఖరీఫ్ వ్యవసాయానికి గాని ఆర్ధిక రంగానికి గాని పునాది లాంటిది. అలాంటి ఖరీఫ్ సీజన్ నైరుతి రుతుపవనాల ఆధారంగానే ప్రారంభమవుతుంది.  సకాలంలో ఎరువాక ప్రారంభించాలనుకుంటున్న అన్నదాతల్లో వాతావరణ శాఖ ప్రకటన నిరుత్సాహన్ని నింపింది. వాతావరణ శాఖ వాళ్లు ఏమైనా దేవుళ్లా వారు చెప్పినట్టు జరగడానికి అని మీరు అనుకోవచ్చు. కాని దేశంలో రుతుపవనాల ప్రవేశానికి సంబంధించి ఐఎండీ ముందస్తు అంచనాలను గత 11 ఏళ్లుగా విడుదల చేస్తోంది. గత ఏడాది తప్ప మిగిలిన పదేళ్లలో వాతావరణ శాఖ చెప్పిన అంచనాలు నిజమయ్యాయి. దీంతో నిన్న విడుదల చేసిన బులెటిన్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏది ఏమైనా సకాలంలో వర్షాలు పడాలని ఆశిద్దాం..