"బంగారుతల్లి"ని వదిలించుకున్న తెలంగాణ..!

ఆడపిల్లల సంక్షేమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన "బంగారుతల్లి" పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. స్త్రీ, శిశు సంక్షేమశాఖ కార్యదర్శి జగదీశ్వర్ ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకాన్ని టీ సర్కార్ రద్దు చేస్తుందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నా..అధికారికంగా మాత్రం ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. లింగ నిష్పత్తిలో అట్టడుగుకు చేరుకుంటున్న ఆడపిల్లల జనాభాను పెంచడం..భ్రూణ హత్యలను నివారించేందుకు  అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి "కిరణ్‌కుమార్ రెడ్డి" ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆయన ఎవరూ ఈ పథకాన్ని రద్దు చేయకుండా "ఆంధ్రప్రదేశ్ బంగారు తల్లి బాలికాభ్యుదాయ, సాధికారిత చట్టం-2013" పేరున దీనికి చట్టబద్థత సైతం కల్పించి "ఆడపిల్లల భారం ఇక ప్రభుత్వానిదే"నన్నారు. అప్పట్లో ఇది సీఎం మానసపుత్రికగా చలామణీ అయ్యింది.

 

జూన్ 1, 2014న బిల్లు అమల్లోకి వచ్చింది. ఆడపిల్ల పుట్టగానే వారి పేరు మీద ప్రత్యేక ఖాతాలు తెరిచి రూ.2500 మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. కాన్పు అనంతరం తొలి రెండేళ్ల అవసరాల కోసం రూ.1000, మూడు నుంచి ఐదేళ్లు వచ్చేవరకు రూ.1500 ఇచ్చే విధంగా చట్టంలో మార్గదర్శకాలున్నాయి. అలాగే పాఠశాల అడ్మిషన్ సమయంలో అంటే ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు రూ.2000, ఎనిమిదో తరగతిలో రూ.2500, తొమ్మిది, పదో తరగతుల్లో రూ.3000, ఇంటర్మీడియట్‌కు వచ్చేసరికి రూ.3500, డిగ్రీలో చేరేనాటికి రూ.4000 ఇవ్వాలని బంగారు తల్లి పథకం నిబంధనలు చెబుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలోని ఒక్కొ పథకాన్ని రద్దు చేయడమో లేదంటే నిధులు నిలుపదల చేయడమో చేస్తూ వస్తున్నారు. అలాంటి పథకాల్లో "బంగారు తల్లి" కూడా ఒకటి.

 

అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 2014 జూన్ నుంచి ఇప్పటి దాకా బంగారుతల్లి పథకం కోసం ప్రభుత్వం నుంచి ఒక్కపైసా విడుదల కాలేదు. మహిళా శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కింద నడిచే ఈ పథకానికి తెలంగాణ తొలి పద్దులో సైతం నిధుల కేటాయింపులు చేయలేదు. ఈ పథకం కోసం లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. అధికారిక సమాచారం ప్రకారం 67,848 ఆడపిల్లల కుటుంబాలు దాదాపు అన్ని ధ్రువీకరణ పత్రాలతో సహా దరఖాస్తులు చేసుకున్నాయి. కాని ఒక్కరంటే ఒక్క లబ్థిదారున్ని కూడా ఎంపిక చేయలేదు. దీని కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర ఆడపిల్లల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి.

 

అయితే ఈ పథకాన్ని రద్దు చేయడానికి గల కారణాలపై ప్రభుత్వ వాదన మరోలా ఉంది. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి విద్యాభివృద్ధితో పాటు వివాహానికి భారీ ఎత్తున ఆర్థిక సాయం చేసేందుకు తగినంత సిబ్బంది లేరని, బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనారిటీ వర్గాల్లోని నిరుపేద మహిళల వివాహానికి  కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, ఆరోగ్యలక్ష్మీ వంటి పథకాల కింద కోట్లు ఖర్చు చేస్తున్నామని..అలాంటప్పుడు మళ్లీ బంగారు తల్లి పథకం అవసరం లేదని సర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ వాదన ఏ మాత్రం సమంజసంగా లేదు. అయితే రెండేళ్లుగా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి.. తదితర విషయాలపై గాని ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వక ఉన్నపళంగా రద్దు చేయడం మాత్రం ఏ మాత్రం బాగోలేదు. ఒక ఊరికి వెళ్లడానికి వంద దారులున్నట్టు, ఒకే రకమైన ఉపయోగం కోసం చాలా రకాల పథకాలు అమల్లో ఉన్నాయి. ప్రజలు వాటిలో తమకు నచ్చిన దానిని ఎన్నుకుని దరఖాస్తు చేసుకుంటారు. ప్రభుత్వ అంతిమ లక్ష్యం ప్రజల సంక్షేమం ఎన్ని పథకాలున్నాయని కాదు వాటి వల్ల ప్రజలకు లబ్ధి కలిగిందా లేదా అన్నదే కావాల్సింది.