ఆకాశమే హద్దుగా భారత వైమానిక దళం!

రక్షణ అనేది ప్రతి దేశానికి అవసరం. ప్రపంచంలో ఎన్నో దేశాలు రక్షణ పరంగా బలంగా ఉండటం వల్ల పక్కదేశం వాడు దాడి చేయకుండా ఉండగలుగుతున్నాడు. ఒకప్పటి కాలంలో రాజులు కోట రక్షణ కోసం, తమ రాజ్యాన్ని పక్క రాజ్యం వాడు దండెత్తి వచ్చి లాక్కోకుండా ఉండటం కోసం సైన్య బలాన్ని పెంచుకుంటూ ఉండేవారు. అయితే రాచరిక వ్యవస్థ పోయాక ఈ రక్షణ వ్యవస్థ క్రమంగా మరుగున పడింది. బ్రిటిషు వారి చేతుల్లో నలిగాక భారతదేశానికి రక్షణ వ్యవస్థ అవసరం మళ్ళీ తెలిసొచ్చింది. జల, వైమానిక, సైనిక దళాల వైపు అడుగులు పడిన కారణంగా నేడు భారతదేశ రక్షణ దళం ప్రపంచంలో పటిష్టమైనదిగా ఆవిర్భవించింది. అంతేకాదు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తన బలాన్ని పెంచుకుంటూ వచ్చింది కూడా. 

అసలు ఎయిర్ ఫోర్స్ డే ఎలా ఏర్పడింది?

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను రాయల్ ఎయిర్ ఫోర్స్ గా పిలిచేవారు. ఇది ఏర్పడినప్పుడు దీనిలో కేవలం ఆరుమంది సభ్యులు, 19 మంది సైనికులు ఉన్నారు అనే విషయం విస్మయం కలిగించినా వీరి ప్రయాణం నేడు ఒక గొప్ప శక్తిగా మారిందంటే ఎంత కృషి చేసి ఉండాలో అర్థమవుతుంది. ఈ సభ్యుల దగ్గర నాలుగు వెస్ట్ ల్యాండ్ వ్యాపిటి IIA ఆర్మీ ప్లైన్ లు ఉండేవి. అప్పటికి ప్రపంచంలో ఇతర దేశాలలో డజన్ల కొద్దీ యుద్దవిమానాలు, ప్లైన్ లు ఉండేవి, వీటితో పోలిస్తే భారతదేశం దగ్గరున్నవి చాలా తక్కువ. అయినా భారతదేశం వాటిని అభివృద్ధి చేసుకోవడంలో సఫలం అయింది. 1936, 1938 సంవత్సరాలలో  వీటిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు. ఫలితంగా రెండవ ప్రపంచ యుద్ధ సమయానికి భారత వాయు దళం చాలా శక్తివంతగా రూపు మార్చుకుంది. 

1941 సంవత్సరం తరువాత శిక్షణా నిర్వహణలు ఎంతో వేగం పుంజుకున్నాయి. శిక్షణ కోసం క్లబ్ లు ఏర్పాటుచేయడం, యువ రక్తాన్ని ఈ వర్గంలో భాగస్వామ్యం చేయడం వంటి చర్యల వల్ల భారత వైమానికదళం పటిష్టత పొందింది.

1932 అక్టోబర్ 8 వ తేదీన స్థాపించబడిన భారత వైమానిక దళం ప్రస్తుతం 90 వ ఎయిర్ ఫోర్స్ డే సైలెబ్రేషన్ ని జరుపుకోబోతోంది. యుద్ధాలలోనూ, రక్షణ వ్యవస్థ తనవంతు పాత్ర సమర్థవంతంగా పోషించే వాయుదళం తన విజయాలను గుర్తుచేసుకుంటూ, అమరవీరులకు నివాళులు అర్పిస్తూ దేశమంతా చాటిచెబుతుంది. 

భారత వాయుదళం గురించి!

ప్రతి సంవత్సరం ఒక్కో చోట భారత వాయుదళం వేడుకలు జరపడం సాధారణం. 2022 సంవత్సరం అక్టోబర్ 8 న జరుగుతున్న ఈ వేడుకలకు చండీఘర్ వేదిక అయింది.

వాయు దళం తన బలాన్ని ప్రదర్శిస్తూ విన్యాసాలు చేస్తుంది. దీనికోసం ముందుగుగానే సన్నాహాలు చేస్తోంది, గొప్ప సాధన వీరి సొంతం కూడా.  ఆకాశంలో అద్భుతం చేసే ఈ విన్యాసాలు చూడటానికి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.

ఈసారి జరుగుతున్న  ఎయిర్ షోలో 83 విమానాలు పాల్గొంటాయి.  ఎయిర్ షోలో పాల్గొనే విమానంలో 44 యుద్ధ విమానాలు, 7 రవాణా విమానాలు, 20 హెలికాప్టర్లు ఇంకా 7 పాతకాలపు విమానాలు ఉన్నాయి.  అదే సమయంలో 9 విమానాలను సిద్ధంగా ఉంచుతారు. ఒకో సంవత్సరం ఒక ప్రత్యేకత ఉన్నట్టు ఈసారి ఎయిర్ షో ప్రత్యేకత ఏంటంటే.. కొత్త తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లను కూడా ఇందులో చేర్చనున్నారు.

ప్రతి వర్గానికి ఒక నినాదం అంటూ ఉంటుంది. అలాగే ప్రతి దేశానికి కూడా నినాదం ఉంటుంది. అలాగే భారత వాయుదళానికి కూడా ఓ నినాదముంది. ఈ నినాదం వెనుక ఒక ఆసక్తికర విషయముంది.

"నభః స్పృషం దీప్తమ్"  అనేది భారత వైమానిక దళం యొక్క నినాదం. ఇది గీతలోని పదకొండవ అధ్యాయం నుండి తీసుకోబడింది. మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన కర్తవ్య ఉపదేశమే ఈ నినాదం వెనుక కారణం. ఈ నినాదంతోనే భారత వైమానిక దళం తన విధులను నిర్వహిస్తుంది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి కొన్ని ముఖ్యవిషయాలు!

భారత వైమానిక దళం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద వైమానిక దళం.  యుపిలోని ఘజియాబాద్‌లో ఉన్న హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆసియాలోనే అతిపెద్దది.

IAF అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని అర్థం. భారత వైమానిక దళం వివిధ కార్యకలాపాలలో ముఖ్యమైన పాత్ర పోషించింది.  వీటిలో ఆపరేషన్ పూమలై, విజయ్, మేఘదూత్ మొదలైనవి ఉన్నాయి.

భారత వైమానిక దళం IAF ఐక్యరాజ్యసమితితో శాంతి పరిరక్షణ మిషన్లలో కూడా పనిచేస్తుంది.

భారత వైమానిక దళాన్ని గతంలో రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని పిలిచేవారు.  ఈ పేరు స్వాతంత్ర్యం వరకు ఉన్నప్పటికీ,  స్వాతంత్య్రానంతరం రాయల్ అనే పదాన్ని తొలగించారు.

IAFలో అధిక సంఖ్యలో మహిళా ఫైటర్ పైలట్లు, మహిళా నావిగేటర్లు, మహిళా అధికారులు ఉన్నారు, వీరు భారత వైమానిక దళానికి తమ సేవలను అందిస్తారు.  భారత వైమానిక దళానికి చెందిన రాఫెల్ ఫ్లీట్‌లో కూడా మహిళా ఫైటర్ పైలట్ ఉన్నారు.

దేశంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో భారత వైమానిక దళం ఎల్లప్పుడూ సహాయక చర్యల్లో పాల్గొంటుంది.  వీటిలో గుజరాత్ తుఫాను(1998), సునామీ (2004), ఉత్తర భారతదేశంలోని వరదలు ఉన్నాయి.  అయితే, ఉత్తరాఖండ్‌లో వరదల సమయంలో చిక్కుకుపోయిన పౌరులను రక్షించడం ద్వారా IAF ప్రపంచ రికార్డు సృష్టించింది.  ఈ మిషన్‌కు 'రాహత్' అని పేరు పెట్టారు, ఈ సమయంలో భారత వైమానిక దళం దాదాపు 20,000 మందిని రక్షించింది.

ఇలా భారత వైమానిక దళం ఆకాశమే హద్దుగా ప్రపంచంలో గొప్పగా ఎదిగి దేశానికి అన్ని వేళల్లో నేనున్నానని భరోసా ఇస్తుంది. భారత వైమానిక దళానికి సెల్యూట్ చేయాలి మరి.


                                       ◆నిశ్శబ్ద.