ఓటెయ్యండి..చెప్పుతో కొట్టండి..
posted on Nov 22, 2018 3:50PM

ఎన్నికలు వచ్చాయి అంటే నియోజక వర్గాలు ప్రజా ప్రతినిధుల ప్రచారాలతో హోరెత్తుతాయి. ఓటర్లను ప్రలోభ పెట్టటానికి రక రకాల హామీలను ప్రకటిస్తుంటారు. ఎన్నికల్లో గెలిచాక హామీలు నెరవేర్చే వారికన్నా... మరిచే వల్లే ఎక్కువ. మళ్ళీ ఎన్నికలు వస్తే కానీ మనవైపు తిరిగి చూడరు. కానీ ఓ స్వతంత్ర అభ్యర్థి మాత్రం ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే చెప్పుతో కొట్టమంటున్నాడు. ఆయనే జగిత్యాల జిల్లాలోని కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆకుల హన్మాండ్లు. ప్రచారంలో భాగంగా ఇంటింటికీ తిరుగుతూ కరపత్రం, రాజీనామా పత్రంతో పాటు చెప్పులు కూడా పంచుతున్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే తనను చెప్పుతో కొట్టి మరీ పని చేయించుకోవాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ తన పనితనం నచ్చకపోతే తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీకి పంపించి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని ఎవరైనా రద్దు చేయించొచ్చంటూ వివరిస్తున్నారు. 70 ఏళ్లుగా మోసపోయారని, ఇకపై అలా జరగకుండా ఉండాలంటే స్వతంత్ర అభ్యర్థి అయిన తనను గెలిపించాలంటూ ఆకుల హన్మాండ్లు కోరుతున్నారు. వినూత్నంగా ప్రచారం చేస్తున్న ఆకుల హన్మాండ్లు ని ప్రజలు గెలిపిస్తారో లేదో వేచి చూద్దాం..!!