కష్టమైతే ఖచ్చితంగా చెప్పేయండి!

మనుషుల మధ్య బంధాలు ఎంతో సహజం  ఈ బంధాలు చాలా దగ్గరివి కావచ్చు, సాధారణమైనవి కావచ్చు. కొన్ని బంధాల విషయంలో పెద్దగా ఎక్స్పెక్టషన్స్ ఉండవు, మరికొన్ని బంధాలను అంతగా పట్టించుకోరు. కానీ ప్రతి విషయాన్ని చెప్పాల్సిన అవసరం, ప్రతి నిమిషం గురించి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం వ్యక్తిగత బంధాలకు ఉంది. ఆ వ్యక్తిగత బంధాలలో భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో అది సరైన విధంగా లేకుంటే అంతే సున్నితంగా ఉంటుంది. 

ఈమధ్య కాలంలో కాబోయే జీవిత భాగస్వాములకు కొన్ని లిస్ట్ ఏర్పడ్డాయి. వాటిలో ఇష్టాలు, అభిరుచులు మాత్రమే కాకుండా అవతలి వ్యక్తి ఇలా అనే కొన్ని నిర్ణయాలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే ఆచరణ దగ్గరకు వచ్చేసరికి వాటిలో కొన్ని వెనక్కు తీసుకోవాల్సి రావచ్చు. జీవితభాగస్వాముల దగ్గర కోపాన్ని విషయాల్లో ఏమి పర్లేదులే, అడ్జస్ట్ అయిపోవచ్చు అని తీసుకునే కొన్ని నిర్ణయాలు తరువాత చాలా ఇబ్బంది పెట్టేస్తాయని ఫ్యామిలీ కౌన్సిలర్లు చెబుతున్నారు.

స్పష్టత ముఖ్యం!

ఏ విషయంలో అయినా స్పష్టత చాలా ముఖ్యం. అది ఒకరికి ఏదైనా చెప్పడం, ఒకరు ఇలా ఉండాలి అని అనుకోవడం మాత్రమే కాదు, ఎదుటి వ్యక్తి నుండి కోరుకుంటున్న విషయం ఎందుకు కోరుకుంటున్నామని, దానివల్ల జీవితానికి చేకూరే ప్రయోజనం, జీవితంలో ఆ నిర్ణయం వల్ల ఏర్పడే పరిస్థితులు, దాని ప్రాముఖ్యత వంటివన్నీ ఆలోచించి ఆ తరువాత నిర్ణయం తీసుకోవాలి.

ఒత్తిడికి తలొగ్గద్దు!

భార్యాభర్తలు కావడం కోసమైనా, భార్యాభర్తలు అయిన తరువాత అయినా పెద్దవాళ్ళ ఒత్తిడి చాలా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని భరించలేమని, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పినా పెద్దవాళ్ళు పరువు పోతుందని, చుట్టుపక్కల ఏదో అనుకుంటారని, ఆర్థికపరమైన బెనిఫిట్స్ పోతాయని ఆలోచించి విడిపోవద్దని, బంధం కలుపుకోవాలని ఒత్తిడి చేస్తుంటారు. కానీ సమస్య అనిపించినప్పుడు అసలు ఎవరి ఒత్తిడో భరించలేక ఇరుక్కుపోవద్దు.

మొహమాటం వదిలెయ్యాలి!

కొందరు కొన్ని విషయాలు జీవిత భాగస్వామితో చెప్పడానికి కూడా మోహమాటపడుతుంటారు. ఇంకా ఆ మొహమాటం స్థానంలో కాసింత భయం కూడా ఉంది ఉండచ్చు, ఏదైనా స్వేచ్ఛగా పంచుకునే చనువు కూడా లేకపోవచ్చు. అలాంటివన్నీ లేకపోతేనే బాగుంటుంది. ఇష్టం లేని విషయాల నుండి అవతలి వాళ్ళ ఆలోచనలకు వ్యతిరేకమైన నిర్ణయాల గురించి మనసులో ఉన్నట్టయితే వాటిని గురించి ఎలాంటి మొహమాటం లేకుండా బయటకు చెప్పేయడం మంచిది. 

నిర్ణయాలు వెనక్కు తీసుకోవడం కష్టం!

కాబోయే భాగస్వామి లేదా జీవిత భాగస్వామి విషయంలో ఏవైనా విషయాలు మొహమాటం కొద్దీ సరేనని చెప్పడం, ఏవైనా షరతులు ఒప్పుకోవడం, ప్లానింగ్స్, ఆర్థిక, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయాల గురించి ఒప్పుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఎందుకంటే ఇలాంటి విషయాలలో మాట ఇవ్వడం అంటే ఇక అది పూర్తిగా ఒకరి చేతుల నుండి జారిపోయినట్టు. ఇద్దరి నిర్ణయంగా మారిపోయినట్టు. ఆ తరువాత ఏదైనా అసౌకర్యం కలిగి కాదు కూడదు అనలేని పరిస్థితులు ఎదురైతే అది చాలా పెద్ద సమస్యగా కనిపిస్తుంది.

పైన చెప్పుకున్నవి మాత్రమే కాకుండా పెళ్ళైన వాళ్ళు కూడా దేన్నీ చాలా కష్టంగా భరించకూడదు. అసలు భరించడం అనే మాటల్లోనే చెప్పలేనంత ఇబ్బంది ఉంది కాబట్టి ఏ విషయంలో అయినా కష్టమనిపిస్తే మొదటగా దాన్ని బయటకు చెప్పేయడం మంచిది.

                             ◆ వెంకటేష్ పువ్వాడ.