శ్రీలక్ష్మి కేసు హైకోర్టులో సీబీఐ వాదన

హైదరాబాద్: ఓబుళాపురం గనుల కేసులో అరెస్టై బెయిల్ పొందిన శ్రీలక్ష్మి విచారణకు సహకరించడం లేదని సిబిఐ తరఫు న్యాయవాది హైకోర్టులో వాదించారు. శ్రీలక్ష్మి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సిబిఐ ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 26న శ్రీలక్ష్మి కౌంటర్ దాఖలు చేశారు. బుధవారం ఇరువర్గాలు తమ వాదనలు వినిపించాయి. శ్రీలక్ష్మి అనారోగ్యాన్ని సాకుగా చూపడం సరికాదని, ఆ కారణంగానే ఆమె బెయిల్ తీసుకున్నారని సిబిఐ తరఫు న్యాయవాది వాదించారు. ఓఎంసికి అనుకూలంగా వ్యవహరించమని కింది ఉద్యోగులను ఆమె ఆదేశించారని, ఓఎంసికి లబ్ధి చేకూరేలా ఇతర దరఖాస్తులను పక్కన పెట్టారని తెలిపారు. జీవోలు అన్నీ ఒకేరోజు విడుదల చేశారని కోర్టులో వాదించారు. సిబిఐ తరఫు న్యాయవాది వాదనలు శ్రీలక్ష్మి న్యాయవాది తప్పు పట్టారు. శ్రీలక్ష్మి పరిశ్రమల శాఖ అధికారిగా చార్జ్ తీసుకోక ముందే ఓఎంసికి లీజులు అందాయన్నారు. బెయిల్‌పై విడుదలయ్యాకు ఆమె ఎవరినీ బెదిరించలేదని అలాంటప్పుడు ఆమె, ఆమె భర్త సాక్షులను బెదిరిస్తారన్న సిబిఐ వాదనలో అర్థం లేదన్నారు. కాగా ఇరువురి వాదనలు పూర్తయ్యాయి. నిర్ణయాన్ని కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కాగా గాలి జనార్షన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిల బెయిల్ పిటిషన్ కేసును కోర్టు 30వ తేదికి వాయిదా వేసింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu