మానవహక్కుల గళం విప్పుదాం!!

ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కొన్ని హక్కులను కలిగి ఉన్నాడు. ఆ హక్కులు ఇప్పటికిప్పుడు సంక్రమించినవి కాదు. నాటి బ్రిటీషు కాలంలో బానిసత్వం తప్ప ఏమీ లేదు మనుషులకు. అయితే కాలానుగుణంగా జరిగిన పోరాటాల ఫలితంగా ప్రస్తుతం ఎన్నో రకాల స్వేచ్ఛ మనకు అందుతోంది. మనకు లభిస్తున్న ప్రతి స్వేచ్చా కొన్ని రకాల హక్కుల ద్వారా లభిస్తోంది. మాట్లాడే హక్కుతో స్వేచ్ఛగా మాట్లాడటం, జీవించే హక్కుతో నచ్చినట్టు బ్రతకడం, ప్రాథమిక హక్కులతో విద్య, వైద్యం, ఆహారం, కనీస అవసరాలు, తిండి-గుడ్డ మొదలైనవి పొందటం మనిషికి హక్కుల ద్వారా లభించేవి. 


ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 వతేదీన మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు ఏర్పడింది?? దీని వెనుక ఉన్న కారణం ఏమిటి?? దీని ద్వారా మనుషులు ఏమి సాధించుకోవచ్చు?? మానవ సమాజంలో దీని పాత్ర ఏమిటి?? వంటి విషయాలు వివరంగా…


ఎప్పుడు ఏర్పడింది??


మానవ హక్కుల దినోత్సవం 1948 సంవత్సరం డిసెంబర్ 10 వ తేదీన  ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అప్పటి కాలంలో ఈ ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా సుమారు 500 భాషలలో రూపొందించింది. దీన్ని పురస్కరించుకుని అప్పటి నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 వ తేదీన మానవహక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటోంది. 


మానవ హక్కుల దినోత్సవం వెనుక కారణం!!


ప్రతి మనిషి తన జీవితంలో ఎన్నో రకాల అవసరాలను కలిగి ఉంటాడు. అయితే వాటిని పొందడంలో ఎన్నో రకాల ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ఆర్థిక, సామాజిక ఇబ్బందుల వల్ల వ్యక్తి తనకు అవసరమైన వాటిని సాధించుకోవడంలో విఫలం అవచ్చు లేదా వాటిని సాధించుకోవడానికి తగిన వనరులు అందుబాటులోకి తెచ్చుకోలేకపోవచ్చు. ఇలాంటి కారణాల వల్ల వ్యక్తి జీవితంలో ఎదుగుదల శూన్యంగా మారుతుంది. అలా కాకుండా ప్రతి ఒక్కరూ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సమానత్వం, సంతోషంగా జీవించడం వంటి విషయాలను పొందగలిగితే ఆ మనిషి జీవితం ఉన్నత దశలోకి వెళుతుంది. అందుకే అందరూ ఒక ఉన్నత దశలో ఉండటం వల్ల రాష్ట్రం, దేశం, ప్రపంచం క్రమంగా అభివృద్ధిలోకి వెళుతుంది. ఇలాంటి అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూమానవ హక్కులు పొందాలని ఐక్యరాజ్యసమితి చేసిన ప్రకటననే మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం.


మానవ హక్కుల ద్వారా వ్యక్తి ఏమి సాధించుకోవచ్చు??


వ్యక్తిగత స్వేచ్ఛ ద్వారా వ్యక్తిగత అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రతి వ్యక్తి అభివృద్ధి పథంలో ప్రయాణిస్తే ఈ ప్రపంచం మెల్లిగా అభివృద్ధి కోణంలో ముందుకెళుతుంది. కాబట్టి వ్యక్తి తన జీవితానికి అవసరమైన హక్కులను సాధించుకుంటే వాటిని ఉపయోగించుకోవడం ద్వారా జీవితంలో ఎదుగుదల సాధ్యమవుతుంది.


సమాజంలో మానవ హక్కుల పాత్ర ఏమిటి??


వ్యక్తుల సమూహం సమాజం అయినప్పుడు వ్యక్తులు హక్కుల ద్వారా సాధించే అభివృద్ధి సమాజ అభివృద్ధికి మూలకారణం అవుతుంది. అంతే కాకుండా సమాజానికి మనిషి మూల స్తంభం వంటివాడు. మనిషి బాధ్యతగా ఉంటే బాధ్యతాయుతమైన సమాజం ఏర్పాటు అవుతుంది. కాబట్టి మానవ హక్కుల వినియోగం ఆరోగ్యకరంగా ఉంటే బాధ్యతాయుతమైన సమాజం ఏర్పాటు అవుతుంది.


ఈ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా చరిత్రలో నమోదు అయిన  కొన్ని ముఖ్య ఘట్టాలు..


1865 సంవత్సరంలో బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలను అనుసరించి అమెరికాలో బానిసత్వం రద్దు చేయబడింది. ఈ రద్దు కారణంగా అమెరికాలో స్వేచ్ఛకు బీజం పడింది. 


 

ప్రపంచ చరిత్రలో రెండవ ప్రపంచ యుద్ధం అనేది చాలా దారుణమైన సంఘటనగా వర్ణించవచ్చు.  1941 నుండి 1945 వరకు జరిగిన ఈ యుద్ధంలో చెప్పలేనంత మారణకాండ చోటుచేసుకుంది. హిట్లర్, నాజీ జర్మనీల పోరు బీజం కాస్తా దాదాపు కోటి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయ్యింది.. ఇది ప్రపంచ చరిత్రలో భయంకరమైన అక్షరాలతో లిఖితమైంది. 


 

డిసెంబర్ 1948 గురించి పైన చెప్పుకున్నట్టు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ ప్రకటన ఆధారంగా ప్రతి ఒక్కరూ తమకు అవసరమైన స్వేచ్ఛను హక్కుల రూపంలో పొందేందుకు అవకాశం కల్పించింది. 


  2015 సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల మధ్య అసమానత్వం తొలగించే దిశగా చేసిన కృషి ఫలితంగా  అందరికీ సమానత్వం అనే నినాదంతో ఫిన్లాండ్ నాన్-డిస్క్రిమినేషన్ యాక్ట్‌ను ఆమోదించింది. ఇది విద్య, వ్యాపారం, ఉద్యోగాలలో వివక్షతను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన అంశం. 


ఈ విధంగా ప్రపంచ చరిత్రలో  మానవహక్కుల గురించి ఎన్నో విషయాలు పొందుపరచబడ్డాయి. వీటిని దుర్వినియోగం చేయకుండా సరైన రీతిలో వినియోగించుకుంటే ప్రతి వ్యక్తి తాను అభివృద్ధి చెందడమే కాకుండా ఇతరులను, సమాజాన్ని కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్లగలడు.


                                    ◆నిశ్శబ్ద.