బేగంబజార్‌లో 100మందికి కరోనా

కరోనా. కరోనా. కరోనా. ఎటు చూసినా కొవిడ్ కేసులే. సెకండ్ వేవ్ ఓ రేంజ్‌లో విరుచుకుపడుతోంది. దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలు సైతం నిత్యం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులతో హడలెత్తిస్తున్నాయి. 

జనాలు జాగ్రత్తలు పాటించకపోవడమే కొవిడ్ విజృంభణకు కారణం. రద్దీ ప్రాంతాల్లో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. హోల్‌సేల్ మార్కెట్‌కు పేరు గాంచిన హైదరాబాద్‌లోని బేగం బజార్‌లో కరోనా కోరలు చాస్తోంది. బేగం బజార్ మార్కెట్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. మార్కెట్లో ఏకంగా 100మందికి పైగా వ్యాపారులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. 

దీంతో, మార్కెట్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే మార్కెట్ ను తెరవాలని నిర్ణయించింది. సాయంత్రం 5 తర్వాత అన్ని షాపులను బంద్ చేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా ప్రభావం తగ్గేంత వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది.

ఒకే మార్కెట్లో ఏకంగా వంద మందికి కొవిడ్ సోకడం మామూలు విషయమేమీ కాదు. నిత్యం ఎంతో బిజీగా ఉండే బేగం బజార్ పై కరోనా పంజా విసరడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. బేగం బజార్ మార్కెట్‌లో ప్రతిరోజూ పెద్ద ఎత్తున కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతుంటాయి. వివిధ జిల్లాలకు చెందిన చిన్న వ్యాపారులు.. బేగం బజార్ హోల్‌సేల్ మార్కెట్లో సరుకులు కొని తమ షాపుల్లో అమ్ముతుంటారు. అంటే, ఆ సరుకులు, ఆ వ్యాపారులతో పాటు కరోనా వైరస్ కూడా ఇప్పటికే వివిధ ప్రాంతాలకు ట్రాన్స్‌పోర్ట్ అయి ఉంటుందనే భయం వారిని వేధిస్తోంది. బేగంబజార్ మార్కెట్‌లోనే 100మందికి కరోనా సోకిందంటే.. వారి నుంచి ఇంకెంత మందికి వైరస్ వ్యాపించిందోనని భయపడిపోతున్నారు వ్యాపారులు. అందుకే, సెకండ్ వేవ్ వేగంగా విస్తరిస్తున్న కారణంగా కొంత కాలం పాటు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు. నిర్లక్ష్యం ప్రాణానికే ప్రమాదం.