శ్రీ‌వారి సేవలో చంద్ర‌బాబు.. దీక్షితులపై డైలాగ్స్ 

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు. దర్శనం అనంతరం చంద్రబాబుకు అర్చ‌కులు తీర్థ‌ప్ర‌సాదాలు అందించి ఆశీర్వ‌దించారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు చంద్రబాబు. ప్రచారం ప్రారంభించడానికి ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి  చేరుకున్న చంద్రబాబు...  ప‌లువురు స్థానిక టీడీపీ నేత‌ల‌తో క‌లిసి తిరుమలకు వెళ్లారు. 

 శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌డం అదృష్టంగా భావిస్తున్నాన‌ని తెలిపారు చంద్రబాబు.  2003లో త‌న‌పై  దాడి జ‌రిగినప్పుడు వెంక‌టేశ్వ‌ర స్వామే కాపాడార‌ని అన్నారు. ధ‌ర్మాన్ని కాపాడితే అది మ‌న‌ల్ని కాపాడుతుంద‌ని చెప్పారు. మ‌నుషుల‌ను దేవుళ్ల‌తో పోల్చ‌డం స‌రికాద‌ని చెప్పారు చంద్రబాబు. మ‌నిషి ఎప్పుడూ దేవుడు కాలేడ‌ని, మ‌నిషి మ‌నిషేన‌ని, దేవుడు దేవుడేన‌ని వ్యాఖ్యానించారు. తిరుమ‌ల ప‌విత్ర‌త‌ను కాపాడాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంద‌ని తెలిపారు. కోట్ల మంది మ‌నోభావాల‌కు సంబంధించిన అంశాల‌పై బాధ్య‌త‌గా ఉండాల‌ని చెప్పారు.
 
ఇటీవలే టీటీడీ ప్రధాన అర్చకుడిగా తిరిగి నియమితులయ్యారు రమణ దీక్షితులు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జగన్‌ను క‌లిసిన‌ టీటీడీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు జ‌గ‌న్‌ను విష్ణుమూర్తి ప్రతిరూపంగా అభివర్ణించారు. దీనికి కౌంటర్ గానే చంద్రబాబు అలా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.