ఆఫీసు పనిలో ఒత్తిడి ఎదుర్కొంటున్నారా? ఈ చిట్కాలు ఫాలో అవ్వండి..!

ప్రతి వ్యక్తికి నేటికాలంలో ఇల్లు, ఆఫీసు అంటూ రెండు ప్రదేశాలు ముఖ్యంగా మారాయి.  ఒకటి కుటుంబ సభ్యులతో కలసి ఉండేది అయితే రెండవది కుటుంబ సభ్యులను పోషించడానికి మరొక ప్రదేశంలో విభిన్న వ్యక్తులతో కలిసి పనిచేసే స్థలం. చాలామంది ఆఫీసులో ఒత్తిడి ఎదుర్కుంటున్నామని చెబుతూ ఉంటారు. ఆఫీసులో గనుక పని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటే అది మానసిక ఆరోగ్యాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. అయితే కొన్ని చిన్న చిన్న మార్పులు, చిట్కాలతో ఒత్తిడి నుండి బయట పడవచ్చు. ఇవి నేరుగా ఆఫీసుకు వెళ్లి పని చేసే వారికి అయినా,  లేక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి అయినా చాలా చక్కగా పని చేస్తాయి.  అవేంటో తెలుసుకుంటే..

పనుల జాబితా..

ఈ చిట్కా ఖచ్చితంగా  సహాయపడుతుంది. ఉదయాన్నే డైరీలో రోజు పనులను రాసుకోవాలి. పైన తేలికైన పనులను,  దిగువన ఎక్కువ సమయం,  శ్రద్ధ అవసరమయ్యే పనులను లిస్ట్  చేయాలి. ఇది  మనస్సు గందరగోళం లేకుండా క్లారిటీగా  ఉంచడానికి సహాయపడుతుంది.  రోజులో ఆ పనులు చేయాలి, ఈ పనులు చేయాలి.. వాటిని ఎప్పుడు చేయాలో అనుకుంటూ  అతిగా ఆలోచించడాన్ని తగ్గిస్తుంది.

బ్రేక్ ముఖ్యం..

 ఎంత పని ఉన్నా సరే.. గంటల తరబడి కూర్చుని పని చేయడం తప్పు. ప్రతి 25-30 నిమిషాల పని తర్వాత 5 నిమిషాల విరామం తీసుకోవాలి. నీరు త్రాగడం,  కళ్ళు మూసుకోవడం  లేదా కొద్దిగా శరీరాన్ని రిలాక్స్ చేసుకోవడం.. ఇవన్నీ  మనసు అలసిపోకుండా  విశ్రాంతిని ఇస్తాయి.   ఒత్తిడిని తగ్గిస్తాయి.

నో చెప్పడం నేర్చుకోండి..

ఇది అతి ముఖ్యమైన చిట్కా ఏమిటంటే.. ప్రతి పనినీ, మీటింగ్‌నీ లేదా పనిని.. ఇట్లా ఏదైనా సరే.. ఆఫీసులో  అదనపు బాధ్యతను ఎప్పుడూ తీసుకోకూడదు. చాలా మంది కాస్త మంచిగా మాట్లాడుతూ,  కాస్త పొగుడుతూ ఏదైనా పని చేసిపెట్టమని అడుగుతూ ఉంటారు.  అలాంటి సందర్భాలలో  మర్యాదగా తిరస్కరించాలి.  ఇది  మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎందుకంటే అదనపు పని భారం ఒత్తిడికి దారి తీస్తుంది.  ప్రతి ఒక్కరూ నో చెప్పడం నేర్చుకోవాలి. ఇది ఎంతో సహాయపడుతుంది.

శారీరక శ్రమ..

 పనిలో బిజీగా ఉన్నప్పటికీ, ప్రతిరోజూ 15-30 నిమిషాలు నడవడం, యోగా చేయడం లేదా తేలికపాటి వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది సహజ ఒత్తిడిని తగ్గించే మార్గం.  ఒత్తిడి హార్మోన్లు వ్యాయామం వల్ల తగ్గుతాయి. వ్యాయమం మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఇది  ఫిట్‌గా ఉంచుతుంది. డెస్క్ దగ్గరే కూర్చుని చేయగల యోగా భంగిమలు కొన్ని ఉంటాయి.  అలాంటివి చేసినా బాగుంటుంది.

                         *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu