లవ్ బ్రేకప్ తర్వాత బాధ నుండి బయటపడే మార్గాలు తెలుసుకోండి..!
posted on Oct 3, 2025 9:30AM
.webp)
ప్రేమ.. రెండక్షరాల పదం.. రెండు మనసుల కలయిక. అయితే మనసులు కలిసినట్టు మనుషులు ఉండలేరు. మనుషుల పంథా వేరు.. మనసుల పంథా వేరు.. మనసు కావాలని అడిగింది మనిషికి కష్టంగా అనిపించవచ్చు. మనసు బాగుందని చెప్పింది.. మనిషికి బాలేదు అనిపించవచ్చు. ముఖ్యంగా ఇద్దరు వేర్వేరు మనుషులు ప్రేమ మొదలైనప్పుడు అన్నింటిని పక్కన పెట్టేస్తారు.. కానీ ఇద్దరూ ఒకరికొకరు అలవాటు అయిపోయాక.. ఇద్దరిలో తప్పులు, లోపాలు, సమస్యలు అన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఈ కారణాల వల్ల జరిగేదే బ్రేకప్..
లవ్ బ్రేకప్ ఈ కాలంలో చాలా సాధారణం అయిపోయింది. కానీ అది ప్రతి మనిషికి చెప్పలేనంత బాధను పరిచయం చేస్తుంది. ప్రేమలో మోసపోవడం లేదా ప్రేమ వైఫల్యం.. వీటి వల్ల మనసు అనుభవించే నరకం అంతా ఇంతా కాదు.. కొందరైతే రోజులు, నెలలు, ఏళ్లకేళ్లుగా బాధలో మునిగిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. భవిష్యత్తు అంటూ ఏమీ లేకుండా చేసుకుంటారు. ప్రేమలో వైఫల్యం ఎదురైనా, ప్రేమలో మోసపోయినా దాన్నుండి బయటకు రావాలి. అప్పుడే భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తుంది. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే..
అంగీకారం..
ప్రేమలో మోసపోయినప్పుడు లేదా ప్రేమలో వైఫల్యం ఎదురైనప్పుడు కోపం , విచారం,నిరాశ వంటి భావోద్వేగాలు సహజం. వాటిని అణచివేయడానికి ప్రయత్నించే బదులు, వాటిని అంగీకరించడం నేర్చుకోవాలి. ఏడుపు వస్తే ఏడవడం, మనసులో ఏం అనిపిస్తే అది రాసుకోవడం లేదా నమ్మకమైన స్నేహితులతో మాట్లాడటం వల్ల తేలికగా అనిపించవచ్చు. మనసులోని బరువు తగ్గడం వల్ల ప్రేమ చేసిన గాయం నుండి కోలుకోవడం కాస్త సులువు అవుతుంది.
సమయం..
ప్రేమలో వైఫల్యం ఎదురవడం లేదా మోసపోవడం వంటివి జరిగినప్పుడు దాన్నుండి బయట పడటానికి సమయం పడుతుంది. అంతేకాదు.. దీన్నుండి బయట పడాలంటే తమకు తాము సమయం కేటాయించుకోవాలి. సెల్ఫ్ కేర్ తీసుకోవాలి. జరిగిన బాధాకర సంఘటన నుండి బయట పడటానికి చాలామంది కొత్త స్నేహం, కొత్త పరిచయం, కొత్త ప్రేమ ఎంచుకుంటారు. అయితే ఇది చాలా తప్పు. లవ్ బ్రేకప్ నుండి కలిగే బాధను అధిగమించడానకి తన మీద తాను దృష్టి పెట్టి తనను తాను డవలప్ చేసుకోవడం చాలా మంచి మార్గం. అనుకున్న లక్ష్యాలు, కన్న కలలు, అభిరుచులు, ఆసక్తులు.. ఇలా.. అన్నింటిని నిజం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. దీని వల్ల రెండు లాభాలు ఉంటాయి. ఒకటి ప్రేమ గాయాన్ని మరచిపోవచ్చు.. రెండవది అనుకున్న లక్ష్యాలు, కలలు నేరవేర్చుకోవడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. జీవితంలో ఏదైనా సాధించగలం అనే నమ్మకం పోగవుతుంది.
సోషల్ మీడియాకు దూరం..
సోషల్ మీడియా చాలా వరకు దూరమైన ప్రియురాలిని లేదా ప్రియుడిని గుర్తు చేస్తూ ఉంటుంది. లవ్ బ్రేకప్ నుండి బయట పడాలంటే దానికి సోషల్ మీడియా నుండి కొంతకాలం విరామం తీసుకోవడం మంచి మార్గం. డిజిటల్ మీడియాకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. ఇది మనస్సును క్లియర్ చేసుకోవడానికి , మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడానికి మీకు అవకాశాన్ని ఇస్తుంది.
సెల్ఫ్ లవ్..
ప్రేమలో మోసపోయినప్పుడు చాలామంది చేసే పని తమను తాము నిందించుకోవడం. కానీ వేరొకరి తప్పుడు నిర్ణయం వల్ల జరిగిన సంఘటనకు తమ విలువను తాము ఎప్పుడూ తగ్గించుకోకూడదు. ఎదుటి వారు చేసిన తప్పు వల్ల తమ విలువ తగ్గదని కూడా గుర్తుంచుకోవాలి. తనను తాను ప్రేమించుకోవడం, తన బలాలను గుర్తించడం, తనను తాను
మెచ్చుకోవడం, తన గెలుపులను గుర్తు చేసుకోవడం.. ఇవన్నీ కూడా తన మీద తనకు ప్రేమ పెరిగేలా చేస్తాయి.
కొత్త ప్రారంభాలు..
పైన చెప్పుకున్నట్టు అన్నీ పాటిస్తూ ఉంటే.. కాలక్రమేణా బాధ తగ్గడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే బాధ తగ్గుతుందో.. అప్పుడు కొత్తగా జీవితాన్ని ప్రారంభించాలి. ఆ ప్రారంభానికి సిద్ధం కావాలి.కొత్త స్నేహితులను ఎంచుకోవడం, కొత్త కార్యకలాపాల్లో పాల్గొనడం. జీవితంలోని చిన్న చిన్న ఆనందాలను ఎంజాయ్ చేయడం, జీవితంలో మరింత ఎదగడానకి ప్రణాళికలు వేసుకోవడం, ఎప్పుడూ నేర్చుకోవడానికి ప్రయత్నించడం.. ఇవన్నీ ఉంటే.. కొత్త ప్రారంభాలు కొత్త అనుభవాలను , ఆనందాన్ని తెస్తాయి.
*రూపశ్రీ.