ఎన్నికల వేళ డేరాబాబాకు సెలవు.. క్యా బాత్ హై!

పాత సినిమాలో కోటా శ్రీనివాసరావు... తానేం చేసినా... నాకేంటి అంటూ ఓ సరికొత్త మేనరిజం ప్రదర్శించి తెగ పాపులరైపోయాడు. పాపులారిటీ పక్కన పెడితే.. ఏదైనా పని చేసినప్పుడు రివర్స్ గా  ఏదో ఒకటి రాకపోతే ఆ పని చేయడం శుద్ధ దండగ అనేది  కోటా మార్కు లాజిక్కు. రాజకీయ నాయకులు కూడా అంతే. రివర్స్ గా ఏదో ఒకటి లేకపోతే ఏ పనీ చెయ్యరు గాక చెయ్యరు. సరిగ్గా హర్యానాలో కూడా ఇదే జరిగింది. ఈ నెల 10 నుంచి ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో యూపీ, గోవా, మణిపూర్, పంజాబ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి. అయితే సరిగ్గా ఎన్నికల వేళ విచిత్రంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్.. తమదైన శైలిలో ఓ నిర్ణయం తీసుకున్నారు. 

డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా ఇప్పుడు జైల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఓ మర్డర్ కేసుతో పాటు తన ఆశ్రమంలో ఇద్దరు మహిళలను రేప్ చేసిన కేసుల్లో ఆయన రోహ్ తక్ లోని ఓ జైల్లో చిప్పకూడు తింటున్నాడు. శిక్ష అనుభవిస్తున్న డేరాబాబాకు తాత్కాలికంగా సెలవు కల్పిస్తూ విడుదల చేశారు. ఆయన్ని విడుదల చేయడం ఆ ప్రభుత్వానికి గల సార్వభౌమాధికారం. కాకపోతే ఎన్నికల టైమ్ లో ఆయనకు సెలవు ప్రసాదించడం వెనకాల భారీ ఆలోచనే ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 

ఎందుకంటే... హర్యానాలో ఇప్పుడుంది బీజేపీ సర్కారు. దాన్ని ఆనుకునే, ఉత్తరాఖండ్, పంజాబ్ ఉంటాయి. ఉత్తరప్రదేశ్ కూడా చాలా దగ్గరే. ఈ రాష్ట్రాల్లో డేరాబాబాకు వేలాది మంది డివోటీస్ లేదా ఫోలోయర్స్ ఉన్నారు. ఆయన మీద వివాదం చెలరేగినప్పుడు కూడా... వేలాదిమంది శిష్యులు రోజుల తరబడి ఆశ్రమంలోనే ఆయనకు రక్షణగా ఉన్నారు. అప్పట్లో ఓ పెద్ద సీన్ నడిచింది. ఆ ప్రభావం ఎన్నికల పైనా ఉంటుందని భావిస్తున్నారు. బీజేపీ మాత్రమే కాకుండా ఇతర పార్టీలు కూడా రామ్ రహీమ్ బాబా అనుచరులతో టచ్ లో ఉంటున్నారు. లోకల్ గా వారు ఎటు చెబితే ఓట్లు కూడా గణనీయ సంఖ్యలో అటువైపు పడే అవకాశముందంటున్నారు  పరిశీలకలు. ఈ క్రమంలో హర్యానాలో డేరాబాబా విడుదలైతే దాని ఫలితాన్ని ఎంతోకొంత పొందాలనుకునే ఉద్దేశంతోనే ఈ విడుదల నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu