తిరుమలలో ఫుడ్ సేఫ్టీకి ప్రాధాన్యత

తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తిరుమలలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. గత ఐదేళ్ల అధ్వాన స్థితి నుంచి వేగంగా పూర్వ వైభవం సంతరించుకునే దిశగా టీటీడీ అడుగులు వేస్తున్నది. ముఖ్యంగా తిరుమల పవిత్రతకు, పారిశుద్ధ్యానికి గత ఐదేళ్లలో ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వని పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ధర్మారెడ్డి స్థానంలో వచ్చిన ఈవో శ్యామలరావు తిరుమల పవిత్రత, పారిశుద్ధ్యం, పరిశుభ్రతతో పాటుగా.. భక్తుల సౌకర్యాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. 

తిరుమలకు వచ్చే భక్తులకు పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఆహారం అందించాలనే ఉద్దేశంతో పెద్ద, చిన్న హోటళ్లతో సహా అన్ని తినుబండారాల విక్రయ ప్రాంతాలలో వ్యర్థాలను తొలగించేందుకు రెండు డస్ట్ బిన్ల వ్యవస్థను తీసుకురావాలని నిర్ణయించారు. ఈ మేరకు  పరిశుభ్రత విషయంలో ఎటువంటి రాజీ ఉండదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.  అలాగే అన్ని తినుబండారాల విక్రయ ప్రాంతాలలో, చిన్న పెద్ద హోటళ్లలో భక్తుల ఫిర్యాదులు, సలహాలకు ఒక బాక్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 

అంతే కాకుండా శ్రీపద్మావతి విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో పెద్ద, జనతా క్యాంటీన్లు, ఏపీటీడీసీ హోటళ్లపై    సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా    తిరుమలలోని అన్ని హోటళ్లలో చెత్తను తడిచెత్త, పొడి చెత్తగా వేరువేరుగా సేకరించాలని.  హోటల్‌ ఆవరణలో పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా వ్యర్థ పదార్థాలను ఎప్పటికప్పుడు తరలించాలని స్పష్టం చేశారు. హోటళ్ళు  ఆహార పదార్థాల ధరలతో ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయడంతో పాటు ఆహార పదార్ధాలలో సింథటిక్ రంగులు/నిషేధించబడిన రంగులు ఉపయోగించలేదు. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు టేస్ట్ ఎంహేన్సర్ తో చేసిన పదార్థాలు తినరాదు.  హోటల్ లైసెన్స్ పొందిన వారు వాటిని ఎటువంటి సబ్ లీజుకు ఇవ్వలేదు. అన్న వివరాలతో బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పెద్ద మరియు జనతా క్యాంటీన్లు తప్పనిసరిగా తమ హోటళ్ల పేర్లను ప్రదర్శించాలని ఆదేశించారు. సవరించిన ధరలను  రెవెన్యూ విభాగానికి సమర్పించాలన్నారు. 

 తిరుమలలోని అన్ని క్యాంటీన్‌ల వారికి ఆగస్టు 5 తర్వాత ఫుడ్‌ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌ శిక్షణ ఇస్తుందని, ఆ తర్వాత క్యాంటీన్లు, తినుబండారాలను తనిఖీ చేస్తామని తెలియజేశారు. వాటర్‌ బాటిళ్లు కూడా రూ.20కి మించి అమ్మకూడదని, తనిఖీ సమయంలో నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘించినట్లు తేలితే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.అనంతరం అన్నప్రసాదం, దాతల విభాగం, ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్యకలాపాలు, సమస్యలను కూడా ఈవో సమీక్షించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu