పోలీసులు అడ్డుకున్నారంటూ రోడ్డుపైన బైఠాయింపు.. భూమన ఇంటి వద్ద హైడ్రామా

తిరుపతిలోని ఎస్పీ  గో  శాలలో గడిచిన మూడు నెలల్లో 100  గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో తిరుపతిలో గురువారం (ఏప్రిల్ 17) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరుణాకరరెడ్డి ఆరోపణలు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. అలాగే టీటీడీ  ఈవో శ్యామల రావు, కూటమి నాయకులు కూడా ఖండించారు. గడిచిన కొద్ది  రోజులుగా ఈ వివాదం కొనసాగుతున్నది. అనవసర ఆరోపణలు చేయడం భావ్యం కాదని కూటమి ఎమ్మెల్యే లు, ఎంపీలు, నాయకులు చెబుతున్నారు.  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సైతం గోశాలను సందర్శించి వివాదం కారణమైన భూమన ఆరోపణల్లో నిజం లేదని,  గోవులు సహజంగా మరణిస్తే దానికి రాజకీయం రంగు పులమడం సరైంది కాదని సూచించారు.  

ఈ నేపథ్యంలోనే గోశాల ఆరోపణల పై తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు ఎక్స్ వేదికగా జగన్ కు, టీటీడీ మాజీ  చైర్మన్ భూమన కు గోశాలకు రావాలని సవాల్ విసిరారు. ఆ సవాల్ ను స్వీకరించిన   భూమన కరుణాకర్ రెడ్డి ఎ  గురువారం ఉదయం 10 గంటలకు వస్తానని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.  మరో వైపు కూటమి నాయకులు సైతం గోశాలకు రావాలంటూ ర్యాలీ చేపడుతున్నట్లు ప్రకటించారు.శాంతిభద్రతల నేపథ్యంలో పోలీసులు ర్యాలీ లు, నిరసనలు లేకుండా గోశాల పరిశీలన చేసి మీడియా తో మాట్లాడవచ్చని ఆదేశాలు జారీ చేశారు. 

 ఈ నేపథ్యంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద గురువారం (ఏప్రిల్ 17) ఉదయం నుంచి హై డ్రామా కొనసాగింది. పోలీసులు హౌస్ అరెస్టు లు చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. వైసీపీ వారిని బయటకు పంపకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని విమర్శలు గుప్పించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు, కూటమి ఇన్ చార్జిలు ఉదయం గోశాల వద్దకు చేరుకున్నారు.     మరో వైపు భూమన, ఎంపీ, మాజీ ఎమ్మెల్యే లు అనుచరులు, కార్యకర్తలు దాదాపు రెండు వేల మందితో గోశాలకు బయలు దేరారు. దీంతో పోలీసులు అంత మందితో గోశాల వద్దకు వెళ్లడం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందనీ, పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తామని అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగి రోడ్డుపైనే బైఠాయించారు.  కొంత సమయానికి కారు ఎక్కి వెళ్తామని చెప్పిన తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. అప్పటి వరకు గోశాలలో ఎదురు చూసిన ఎమ్మెల్యే పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి కి ఫోన్ చేసి తాము ఎదురుచూస్తున్నానీ, ఎస్కార్ట్ ఇస్తాము గోశాలకు రావాలనీ కోరారు. వస్తానని భూమన సమాచారం ఇచ్చారు.

ఇది జరిగిన కొంత సమయానికి గోశాల వద్దకు తిరుపతి ఎంపీ గురుమూర్తి, భూమన కుమారుడు అభినయ్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ పోలీసులు అభినయ్ రెడ్డి ని లోనికి అనుమతించలేదు.. ఎంపీ ను పోలీసులు దగ్గర ఉండి లోపలికి తీసుకురాగా.. అక్కడ ఎదురు చూస్తున్న కూటమి ఎమ్మెల్యే లు ఎంపీని ప్రశ్నించారు. సవాల్ విసిరిన వ్యక్తి రాకుండా మీరెందుకు వచ్చారని వచ్చారని ప్రశ్నించారు. తాను గోడ దూకి వచ్చాను.. పోలీసులు లోపలికి అనుమతించలేదని ఎంపీ సమాధానం ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే లు మాట్లాడుతూ మీరు వచ్చిన విధంగానే ఆయనా వచ్చిండచ్చు కదా అంటూ ప్రశ్నించారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఎంపీ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఇలా ఉండగా గోశాల బయట భూమన కుమారుడు అభినయ్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకుంటున్నా గోశాలలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు భూమన అభినయ్ రెడ్డిని అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.  ఈ సందర్భంగా భూమన తెలుగుదేశంపై విమర్శలు గుప్పించారు. వారు సవాల్ చేయడంతోనే గోశాల వద్దకు వచ్చాననీ, సవాల్ చేసిన వాళ్లు గోశాలలో కూర్చుని తమను లోనికి రానీయకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారనీ విమర్శలు చేశారు.