ఓటర్లు మీకే ఓటేస్తామని చెప్పారా?: వైసీపీకి హైకోర్టు షాక్
posted on Aug 12, 2025 10:58AM

వైసీపీకి హైకోర్టులో భారీ షాక్ తగిలింది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలలో పోలింగ్ బూత్ ల మార్పుపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ మార్పు వల్ల ఓటర్లు సమీపంలోని బూత్ లలో కాకుండా నాలుగు కిలోమీటర్ల దూరంలోని బూత్ కు వెళ్లి ఓటు వేయాల్సి వస్తున్నదని పేర్కొంటూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో సోమవారం అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్ విచారించిన హైకోర్టు.. ఎన్నికల అధికారుల, వైసీపీ తరఫు న్యాయవాదుల వాదనలు నమోదు చేసింది. ఇరు పక్షాల వాదనలూ విన్న అనంతరం ఈ దశలో ఈ విషయంలో జోక్యం చేసుకోలేమంటూ తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్లు అంతా మీకు అనుకూలమనీ, మీకే ఓట్లు వేస్తారనీ ఎలా నిర్ధారిస్తారని వైసీపీని నిలదీసింది. దీనిపై వైసీపీ తరఫున న్యాయవాదులు ఆయా కుటుంబాలు ఎప్పటి నుంచో వైఎస్ కుటుంబానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. తెల్లవారితే పోలింగ్ ప్రారంభం అవుతున్న ఈ దశలో పోలింగ్ బూత్ ల మార్పుపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు తేల్చి చెబుతూ వైసీపీ పిటిషన్ ను తోసిపుచ్చింది.