శ్రీరామ నవమి ఉత్సవాల నిర్వహణపై హైకోర్టులో నేడు విచారణ
posted on Mar 16, 2015 7:29AM
.jpg)
రాష్ట్ర విభజన తరువాత భద్రాద్రి శ్రీరాముడు తెలంగాణా రాష్ట్రానికి వెళ్ళిపోవడంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడప జిల్లాలో ఒంటిమిట్ట వద్ద గల శ్రీరామాలయం, విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల వద్ద గల రామతీర్దాలను (రామాలయం) పరిశీలించి చివరికి ఒంటిమిట్ట శ్రీరామాలయంలో అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవాలని నిర్వహించాలని నిశ్చయించుకొని అందుకు ఏర్పాట్లు మొదలుపెట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ శ్రీకాకుళంలో గల ఆనందాశ్రమానికి చెందిన శ్రీనివసానంద యోగి, నెల్లిమర్లకు చెందిన సి. శ్రీనివాసరావు అనే ఇరువురు హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు వేసారు. హైకోర్టు ఈరోజు వారి వాజ్యాలను విచారణకు చేప్పట్టనుంది. ఏదయినా చాలా బలమయిన కారణం ఉంటే తప్ప సాధారణంగా కోర్టులు ఇటువంటి విషయాలలో ప్రభుత్వానికున్న విచక్షానాధికారాలను ప్రశ్నించవు. కనుక ఒంటిమిట్టలో శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించాలనుకొంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగానే కోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంటుందని భావించవచ్చును.