ఉత్తమ చిత్రం భగవంత్ కేసరి.. బాలకృష్ణ హర్షం
posted on Aug 2, 2025 3:04PM

మహిళా సాధికారత ఆధారంగా తీసిన భగవంత్ కేసరి సినిమాకు జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని ఆ సినీమా హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. భగవంత్ కేసరి జాతీయ సినిమా పురస్కారాలలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిపైన సంగతి తెలిసిందే. తాను నటించిన భగవంత్ కేసరి సినిమా ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేసిన బాలకృష్ణ ఈ గౌరవం మొత్తం భగవంత్ కేసరి చిత్ర బృందానికే చెందుతుందన్నారు.
చిత్ర నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్ది, ఈ కథను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావిపూడి, ఈ సినిమాలో నటించిన ప్రతి కళాకారుడు, సాంకేతిక నిపుణులు, సిబ్బంది అందరి సమష్టి కృషి వల్లే భగవంత్ కేసరి సినిమా విజయం సాధమైందనీ, ఇప్పుడు ఉత్తమ చిత్రంగా ఎంపిక అయ్యిందనీ పేర్కొన్నారు.
అమరావతిలో నిర్మించనున్న బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికి ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లు పరిశీలించేందుకు బాలకృష్ణ శనివారం ( ఆగస్టు 2) అమరావతి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 21 ఎకరాలలో మూడు దశలలో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఇక తాను నటించిన భగవంత్ కేసరి సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపిక కావడంపై మాట్లాడుతూ.. ఇక నుంచి తాను తీయబోయే సినిమాలలో సమాజానికి సంబంధించిన సందేశాలు ఉంటాయని చెప్పారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో త్వరలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టునున్నట్లు బాలకృష్ణ చెప్పారు.