గోదావరి జిల్లాల్లో విహంగ వీక్షణం.. సంక్రాంతి స్పెషల్ హెలికాప్టర్ రైడ్
posted on Jan 13, 2026 12:33PM

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సంబరాల సందడి వేరే లెవెల్ లో ఉంటుంది. అసలు సంక్రాంతి సంబరాలు చూడాలంటే గోదావరి జిల్లాలకు వెళ్లాల్సిందే అని ఉభయ తెలుగు రాష్ట్రాలలో అత్యధికులు భావిస్తుంటారు. అటువంటి గోదావరి జిల్లాలో ఈ సారి సంక్రాంతి సందడి మరో లెవెల్ కు చేరేలా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. గోదావరి అందాలను, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అంతర్వేది సంగమ స్థలిలి, అలాగే కోనసీమ కొబ్బరి చెట్ల సోయగాలను విహంగ వీక్షణం చేసే అవకాశం కల్పిస్తున్నది.
హైదరాబాద్‌కు చెందిన విహాగ్ సంస్థ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్ ఉభయ తెలుగు రాష్ట్రాలు, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి పండుగ కోసం తరలివచ్చే ప్రయాణీకులకు హెలికాప్టర్ రైడ్ ద్వారా గోదావరి అందాలు వీక్షించే అవకాశం కల్పిస్తోంది. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా పండుగ మూడు రోజులూ ఈ హెలికాప్టర్ రైడ్ అందుబాటులో ఉంటుంది. పాతిక నిముషాల సేపు సాగే ఈ రెడ్ కోసం మనిషికి ఐదు వేల రూపాయలుగా ధర నిర్ణయించారు.
పశ్చిమగోదావరి జిల్లా న సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర కాలేజీ గ్రౌండ్స్ నుండి హెలికాప్టర్ రైడ్ ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి పాతిక నిముషాల పాటు ఉండే ఈ హెలికాప్టర్ రైడ్ లో అంతర్వేది ఆలయం, సముద్రం, గోదావరి కలిసే సంగమ స్థలం, అలాగే గోదావరి పాయలు కలిసే అన్నా చెళ్లెల్ల గట్టు, కోనసీమ కొబ్బరి తోటల అందాలు వీక్షించవచ్చు.