వారం రోజుల పాటు ఏపీకి భారీ వర్షాలు
posted on Aug 10, 2025 10:23AM
.webp)
తెలంగాణలో వానలు దంచి కొడుతున్నాయి. గత మూడు రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులూ వంకలూ పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్ మహానగరం అయితే వర్షాలకు చిగురుటాకులా వణికి పోతున్నది. ఇక ఇప్పుడు ఏపీ వంతు వచ్చింది. ఆదివారం (ఆగస్టు 10) నుంచి వారం రోజుల పాటు ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడం ఏర్పడిందనీ, దీనికి తోడు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాయలసీమ, కోస్తాంధ్రలలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 13వ తేదీ నాటికి బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ, తెలంగాణలో ఈ రోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.