జలదిగ్బంధంలో ఎంజీబీఎస్
posted on Sep 27, 2025 9:45AM
.webp)
హైదరాబాద్‌లో గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాలతో నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. శుక్రవారం కురిసిన భారీ వర్షంతో మూసీనది వరదతో పోటెత్తింది. దీనికి తోడు జంట జలాశయాల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో మూసీ నది మహోగ్రరూపం దాల్చింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఎంజీబీఎస్ బస్టాండ్ నీట మునిగింది. బస్టాండ్ లోని వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో ప్రయాణీకులు భయాందోళనలకు గురయ్యారు. బస్టాండ్ నుంచి బయటకు వచ్చే మార్గంలేక బస్టాండ్ లోనే చిక్కుకుపోయారు. తాడు సాయంతో వారిని బయటకు తీసుకువచ్చారు. హైడ్రాతో పాటు పోలీసులు రంగంలోకి దిగారు. ముందస్తు హెచ్చరిక లేకుండా గండిపేట గేట్లు ఎత్తివేయడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు. మూసీ వరద ఉధృతిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.
శుక్రవారం (సెప్టెంబర్ 26) అర్ధరాత్రి సంబంధిత అధికారులకు ఫోన్ చేసి ఎంజీబీఎస్ లో చిక్కుకున్న ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఉండగా మూసీ వరద ఉధృతి ఒక్క ఎంజీబీఎస్ కే పరిమితం కాలేదు. చాదర్‌ఘాట్ సమీపంలోని మూసానగర్‌లో 200 ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, కట్టుబట్టలతో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. మూసారాంబాగ్ వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. పురానాపూల్ ప్రాం తంలో కూడా పలు పల్లపుప్రాంతాలు జలమయమయ్యాయి.